ఓ వైపు కెరీర్లో పీక్స్ అంటే ఏమిటో చూస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. వరుస హిట్లతో బాక్సాఫీసు బొనాంజాగా మారాడు. ఓటీటీ తెరపై `అన్ స్టాపబుల్`గా మారి విజృంభిస్తున్నాడు. ఇలాంటి దశలో ప్రభుత్వ పురస్కారం కూడా దక్కింది. ఆ జోష్ని రెట్టింపు చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ దక్కింది. ఇది బాలయ్య అభిమానులకే కాదు. తెలుగు చిత్రసీమకు, తెలుగు సినీ అభిమానులకు, తెలుగువాళ్లకు పండగలాంటి వార్త.
దాదాపు 4 దశాబ్దాల ప్రయాణం బాలకృష్ణది. ఈ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ విజయాలతో, పరిశ్రమకు మూలస్థంభంగా నిలిచాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తరంతో పోటీ పడుతూ, ఈతరానికీ తనదైన స్టైల్లో సవాల్ విసిరాడు బాలయ్య. పెద్దవాళ్లలో పెద్దవాడిగా, కుర్రాళ్లలో కుర్రవాడిగా… ఆబాల గోపాలాన్నీ అలరించాడు బాలకృష్ణ. సీరియర్ హీరోల్లో బాలయ్య చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేయలేదు. చేయబోరు కూడా. పౌరాణికం, సాంఘికం, జానపదం, సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, చారిత్రకం.. ఇలా ఏ కోణాన్నీ వదల్లేదు. మాస్, యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్స్‌గా నిలిచాడు. ఫ్యాక్షన్ కథల పేటెంట్ హక్కుల్ని తన దగ్గరే ఉంచుకొన్నాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాడు. ఇటీవల విడుదలైన `డాకూ మహారాజ్`తో సంక్రాంతి హీరో అనిపించుకొన్నాడు. బాలయ్య కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రమిది.
కెరీర్ పరంగా బాలయ్య జెట్ స్పీడులో దూసుకుపోతున్నాడు. బాలయ్య పారితోషికం ఇప్పుడు రూ.30 కోట్లకు పైగానే. దానికి తగ్గట్టే తన మార్కెట్ వాల్యూ పెరిగింది. అన్ స్టాపబుల్ లో బాలయ్య తన కొత్త కోణాన్ని ఆవిష్కరించుకొన్నాడు. బాలయ్య ఇంత జోవియల్ గా, ఇంత ఫ్రెండ్లీగా ఉంటాడా? అనే సంగతి ఈ షోతో అభిమానులకు అర్థమైంది. ఈ షో.. బాలయ్యని అభిమానులు చూసే కోణాన్నే మార్చేసింది. యువ హీరోలు కూడా బాలయ్య దగ్గర చనువు తీసుకొంటున్నారు. `బాలా..` అని పిలిచేంత స్నేహాన్ని సంపాదించుకొంటున్నారు. ఇది ఓ రకంగా.. ఆరోగ్యకరమైన వాతావరణం అనే చెప్పాలి.
మరోవైపు హిందూపురం ఎం.ఎల్.ఏగా హ్యాట్రిక్ కొట్టారు. వైకాపా హవా కొనసాగిన ఎన్నికల్లోనూ హిందూపురంలో గెలిచి, తన బలాన్ని చాటుకొన్నారు. 2024 విజయంతో హ్యాట్రిక్ అందుకొన్నారు. బాలయ్యకు మంత్రి పదవి వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ.. పార్టీ ప్రయోజనాలు, కూటమి ధర్మం దృష్టిలో ఉంచుకొని మంత్రి పదవిని త్యాగం చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా బసవతారం ద్వారా ఆయన అందిస్తున్న సేవలు మర్చిపోలేనివి. రాజకీయ నాయకుడిగా, సేవకుడిగా, కళకారుడిగా అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్ర వేసిన బాలయ్య ఈ పురస్కారానికి నూటిని నూరు పాళ్లూ అర్హుడే.