ఆది, సింహాద్రి తరవాత కూడా ఎన్టీఆర్‌కి హిట్లొచ్చాయి. కానీ వాటితో ఎన్టీఆర్ సంతృప్తి పడలేదేమో అనిపిస్తోంది. యమదొంగ, అదుర్స్, బృందావనం, బాద్షాలు.. ఎన్టీఆర్ కడుపు నింపలేకపోయాయనిపిస్తోంది. అందుకే ఎన్టీఆర్ ప్రతీ సారీ…. ఏదో వెలితి ఫీల్ అయ్యేవాడు. వరుస ఫ్లాపుల తరవాత ‘టెంపర్’ తో హిట్టు కొట్టినా.. ఎన్టీఆర్ ఆకలి తీరలేదు. ‘నాన్నకు ప్రేమతో’ తొలి రూ.50 కోట్ల సినిమాగా నిలిచినా.. ఆవేశం తగ్గలేదు. అందుకే ‘జనతా గ్యారేజ్’ ఆడియో ఫంక్షన్లో కూడా ”నా గమ్యం నాకు ఇంకా దగ్గర కాలేదు.. ఏదో ఓ వెలుగు కనిపిస్తోంది..” అంటూ మాట్లాడాడు. ‘జనతా గ్యారేజ్’ విడుదలయ్యాక… ఆ సినిమా వంద కోట్ల మైలు రాయి దాటాక.. ‘హమ్మయ్య.. నేను ఎదురుచూస్తోంది దీని కోసమే కదా’ అన్నట్టు స్పందించాడు. అంటే ఎన్టీఆర్ అన్వేషణ ఆ వంద కోట్ల కోసమేనా?? ఎన్టీఆర్ టార్గెట్ పూర్తయిపోయినట్టేనా??
జనతా సక్సెస్ మీట్లో ‘గూబ గుయ్ మనేలా కొట్టాం’ అంటూ కల్యాణ్ రామ్ మాట్లాడాడు. ఆ మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని సంతోష పెట్టుండొచ్చు గాక..! గూబ గుయ్మన్నది ఎవరికి? బాక్సాఫీసుకా, మిగిలిన హీరోలకా?? అసలు హిట్‌కి కొలమానం ఏమిటి? వంద కోట్లా? ఇంకేమైనా ఉందా? కాసేపు అంకెల్ని మరచిపోయి వాస్తవాలు మాట్లాడుకొంటే ‘జనతా గ్యారేజ్’ ఏమీ కళాఖండం కాదు. అద్భుతమైన సినిమా కాదు. అది హిట్ సినిమా అంతే! ఈ సినిమాతో నిర్మాతలు , డిస్టిబ్యూటర్లు కోట్లకు కోట్లు పోగేసుకోలేదు. నిర్మాతలు ఈ సినిమాని విడుదలకు ముందే అమ్మేసుకొని లాభాలు దండుకొన్నారు. పంపిణీదారులు ఇప్పుడిప్పుడే బ్రేక్ ఈవెన్‌లో పడ్డారు. ఈ సినిమా తొలి రోజు టాక్ చూస్తే… అందరికీ భయం వేసిన మాట వాస్తవం. ఎన్టీఆర్ కూడా ఆ విషయం బయట పెట్టేశాడు. బెనిఫిట్ షో టాక్ కంగారు పెట్టిందని ఒప్పుకొన్నాడు. విమర్శకులకు ఈ సినిమా అంతగా నచ్చలేదన్న నిజాన్ని పరోక్షంగా ఒప్పుకొన్నాడు. తీరా వంద కోట్లు సాధించాక.. అప్పుడు స్థిమిత పడ్డాడు.
”మేం వసూళ్ల గురించి ఆలోచించం, రికార్డుల గురించి పట్టించుకోం” అన్నది హీరోల మాట. ఎన్టీఆర్ కూడా ఇదే మాట చాలా సార్లు చెప్పాడు. కానీ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ల స్పీచులు చూస్తుంటే.. వీళ్లూ అంకెల గారడీకి పడిపోతారని పిస్తోంది. బృందావనం మంచి సినిమా. ఎన్టీఆర్ తనని తాను మార్చుకోవడానికి ట్రై చేసిన సినిమా అది. టెంపర్ ఇంకా మంచి సినిమా. ఓ సరికొత్త ఎన్టీఆర్‌ని చూపించిన సినిమా అది. నాన్నకు ప్రేమతో అయితే… అదో ప్రయోగం అనుకోవాలి. పూర్తిగా ఎమోషన్ బాండ్‌పై నడిచిన సినిమా అది. జనతా గ్యారేజ్నీ తక్కువ చేయడం లేదు. కానీ… ఆ సినిమాలు ఇవ్వని సంతృప్తి.. జనతా గ్యారేజ్ ఎందుకిచ్చింది. ఎందుకంటే ఈ సినిమాకే డబ్బులొచ్చాయి కాబట్టి. ఈ సినిమానే వంద కోట్లు కొట్టింది కాబట్టి. అంటే ఎన్టీఆర్ టార్గెట్ వంద కోట్లే అన్నమాట. ఎన్టీఆర్ వెలుగు.. గమ్యం అన్నది ఈ అంకెల కోసమే అన్నమాట.
తన కెరీర్లో నాన్నకు ప్రేమతో, టెంపర్, బృందావనం, రాఖీలాంటి సినిమాలున్నందుకు ఎన్టీఆర్ గర్వపడాలి. ఆయన అభిమానులూ సంతోషించాలి. ఈ అంకెల గారడీకి ఎన్టీఆర్ లాంటి స్టార్ పడిపోకూడదు. ఎన్టీఆర్లోని నటుడు వీటికి బెండ్ అవ్వకూడదు. అదొక్కటే చిత్రసీమ కోరుకొంటోంది. కమర్షియల్ పంథాలో నడిచి ప్రేక్షకులకు నచ్చిన ఏ స్టార్ హీరో సినిమా అయినా ఈ రోజుల్లో వంద కోట్లు కొట్టడం విడ్డూరం ఏమీ కాదు. దాని కోసమే పదమూడేళ్లు ఎదురుచూడడం అశా అని చెప్పడం మాత్రం ఎన్టీఆర్ లాంటి నటుడికి సరిపడని మాటలు. ‘గూబ గుయ్ మని కొట్టాం.. దిమ్మదిరిపోయేలా చేశాం’ అనడం కూడా తమ ఆవేశాన్ని చాటి చెప్పుకోవడానికో, మిగిలిన హీరోల్ని దాటేశాం అని చెప్పడానికో తప్ప… అలాంటి స్పీచుల వల్ల ఉపయోగం ఉండదు. ఈ విషయాన్ని నందమూరి సోదరులిద్దరూ గుర్తించుకొంటే మంచిది.