నందమూరి సుహాసిని తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడంతో కూకట్ పల్లి రాజకీయాలు వేడెక్కాయి. నందమూరి హరికృష్ణ అకాల మరణంతో వచ్చిన సానుభూతి, ఆ సమయంలో వీస్తున్న టీఆర్ ఎస్ వ్యతిరేక పవనాలు, సెటిలర్ల ఓట్లు తమకు కలిసొస్తాయని మహా కూటమి గట్టిగా భావించింది. మహాకూటమి గెలిచి తీరుతుందనుకున్న స్థానాల్లో కూకట్ పల్లి ఒకటి. సుహాసిని కోసం ఎన్టీఆర్, కల్యాణ్ రామ్లు రంగంలోకి దిగుతారని, అక్క కు ప్రచారం చేసి పెడతారని చెప్పుకున్నారు. ఇటీవల నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ దగ్గరవ్వడం వల్ల… ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే.. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్లు ప్రచారం సందర్భంగా కనిపించలేదు. తమ అక్కకు ఓటేయమని సోషల్ మీడియాలోనూ అభిమానులకు సందేశం ఇవ్వలేదు.
అయినా టీడీపీ వర్గాలేం కలవర పడలేదు. ఎందుకంటే కూకట్ పల్లి నియోజక వర్గం విజయంపై వాళ్లు అంతధీమా. దానికి తోడు… బాలయ్య ముమ్మరంగా ప్రచారం చేశాడు. తారకరత్న కూడా కలిసొచ్చాడు. కానీ నందమూరి ఆశలన్నీ అడియాశలయ్యాయి. టీఆర్ ఎస్ గాలులు బలంగా వీచడంతో… కూకట్ పల్లి స్థానం కూడా కొట్టుకెళ్లిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్, కల్యాణ్ రామ్లు ప్రచారం చేయకపోవడమే మంచిదైందనిపిస్తోంది. ఒకవేళ ప్రచారం చేసి ఉంటే… `నందమూరి ఫ్యామిలీ మొత్తం కలిసొచ్చినా గెలిపించుకోలేకపోయాం` అన్న అసంతృప్తి ఎక్కువగా వేధించేది. దానికి తోడు.. టీఆర్ ఎస్కి వ్యతిరేకులు అన్న ముద్ర పడేది. వీటి నుంచి.. నందమూరి బ్రదర్స్ తెలివిగా తప్పించుకున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.