తెలుగు రాష్ట్రాల్లో జరిగే రాజకీయ పరిణామాలలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ కుటుంబానికి చెందిన ఎన్టీఆర్, హరికృష్ణ , బాలకృష్ణ లాంటి వారు రాజకీయాల్లోకి వచ్చి, ఎన్నికల పోటీలో విజయం సాధించి ఉన్నారు. అయినప్పటికీ కూడా వీరు చాలా వరకు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలలో పోటీకి మొగ్గుచూపారు. తెలంగాణ ప్రాంతంలో పోటీకి దిగింది చాలా తక్కువ. అయితే ఇప్పుడు 29 ఏళ్ల తర్వాత మళ్లీ నందమూరి కుటుంబానికి చెందిన ఆడపడుచు తెలంగాణ ఎన్నికలలో పోటీ పడుతోంది.
గతంలో ఎన్టీఆర్ నల్గొండ స్థానం (1984) నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఎన్నికల తర్వాత ఆ స్థానాన్ని వదులుకొని మరొక స్థానం నుంచి తన ప్రాతినిధ్యాన్ని కొనసాగించారు. అయితే ఆ తర్వాత 1989 ఎన్నికలలో, ఇటు తెలంగాణ ప్రాంతానికి చెందిన కల్వకుర్తి నియోజకవర్గం నుంచి, అటు రాయలసీమకు చెందిన హిందూపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే తాను ముఖ్యమంత్రిగా ఉంటూ పోటీ చేసిన ఈ ఎన్నికలలో తెలంగాణ నియోజకవర్గమైన కల్వకుర్తిలో ఎన్టీఆర్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తరంజన్ దాస్ అనే సాదా సీదా నాయకుడి చేతిలో ముఖ్యమంత్రి గా ఉన్న ఎన్టీఆర్ చిత్త వడం అప్పట్లో పెను సంచలనాన్ని కలిగించింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ కానీ , ఆ తర్వాత రాజకీయాల్లో కి వచ్చిన హరికృష్ణ కానీ బాలకృష్ణ కానీ తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేయడానికి మొగ్గు చూపలేదు.
అయితే ఇప్పుడు దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత తెలంగాణ ఎన్నికలలో నందమూరి కుటుంబానికి చెందిన హరికృష్ణ కుమార్తె అయిన నందమూరి సుహాసిని ఎన్నికలలో పోటీ చేస్తోంది. మరి నందమూరి కుటుంబానికి ఈసారైనా తెలంగాణ లో ఎన్నికలు కలిసి వస్తాయా లేదా అన్నది వేచి చూడాలి.