ఇద్దరు హీరోల్ని వెండి తెరపై చూస్తేనే కాదు, ఓ వేడుకలో చూసినా…. కళ్లకెంతో తృప్తిగా ఉంటుంది. ఓ హీరో గురించి మరో హీరో మాట్లాడుతుంటే – మనసుకు ఆనందంగా ఉంటుంది. మల్టీస్టారర్ సినిమాల పుణ్యం… ఇద్దరు హీరోలు కలుస్తున్నారు. `అఖండ` లాంటి వేడుకల ద్వారా – ఆ దృశ్యాన్ని వేదికలపై కూడా చూసే అవకాశం, అదృష్టం దొరుకుతుంది. నందమూరి సినిమా హీరో ఫంక్షన్‌కి మెగా హీరో తరలి రావడం.. ఎంతబాగుందో ఆదృశ్యం. అఖండ వేడుకలో… అందరి కళ్లూ అల్లు అర్జున్ పైనే. తను కూడా.. మాటల ద్వారా, చేతల ద్వారా నందమూరి అభిమానుల మనసు గెలుచుకున్నాడు.
బన్నీ స్పీచ్ నందమూరి – అల్లు కుటుంబ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మొదలైంది. `ఈనాటి అనుబంధం ఏనాటిదో` అంటూ పాట అందుకున్నాడు బన్నీ. అల్లు రామలింగయ్య – ఎన్టీఆర్‌ల అనుబంధం.. వాళ్ల చనువు.. ఓసారి గుర్తు చేశాడు. బాలయ్య అంటే డైలాగులకు, డిక్షన్కూ పెట్టిన పేరని.. బాలయ్యని కొనియాడాడు. ఎన్టీఆర్ తరవాత అంత స్పష్టమైన వాచకం… బాలయ్యకే ఉందని కొనియాడాడు. బాలయ్యని ఓ ఫంక్షన్ లో చూసి ఆశ్చర్యపోయానని, ఇంటికెళ్లి కూడా ఆయన గురించి తలచుకున్నానని.. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోయాడు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. చివర్లో `జై బాలయ్య`అంటూ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించాడు. బాలయ్య కూడా బన్నీని సోదరుడు, చాక్లెట్ బోయ్, ఐకాన్ స్టార్ అంటూ సంబోధించి – తన ప్రేమని తెలియజేశాడు. పుష్ప కూడా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు.
పనిలో పనిగా బన్నీ అన్ స్టాపబుల్, పుష్ప సినిమాల్ని గుర్తు చేసి – వాటికీ ఈ వేదిక ద్వారా ప్రచారం కల్పించుకున్నాడు. బాలయ్య ఆహాలో అన్ స్టాపబుల్ చేస్తున్నాడు కదా..? దాన్ని కోట్ చేసేలా..`బోయపాటి – బాలయ్యల కాంబినేషన్ అన్‌స్టాపబుల్` అంటూ తన ప్రసంగంలో చోటు కల్పించాడు. `కోవిడ్ వచ్చినా – దేవుడే దిగి వచ్చినా – తగ్గేదేలే` అంటూ పుష్ప సినిమాలో మేనరిజంతో సహా – పుష్ప ప్రమోషన్ని ఈ వేదికపై నుంచే మొదలెట్టేశాడు. మొత్తానికి బన్నీ స్పీచ్ అటు నందమూరి అభిమానులతో పాటు, ఇటు అల్లు ఫ్యాన్స్‌నీ ఆకట్టుకుంది.