నందమూరి హరికృష్ణ.. పెద్దగా సినిమాల్లో నటించకపోయి ఉండవచ్చు.. రాజకీయాల్లో కీలక పాత్రలు పోషించకపోయి ఉండవచ్చు.. కానీ ఆయన ఎప్పుడూ.. నందమూరి అభిమానులకు… టీడీపీ నేతలకు.. దూరంగా ఉన్న సందర్భం లేదు. తెలుగుదేశం పార్టీలో హరికృష్ణ అంటే.. ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది చైతన్యరథమే. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత.. రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి .. తమిళనాడులో ఎంజీఆర్ ఉపయోగించిన షెవర్లెట్ వాహనాన్ని తీసుకున్నారు. దానికి తనకు అనువైన రీతిలో కొన్ని మార్పులు చేసుకున్నారు. చైతన్యరథం అని పేరు పెట్టుకున్నారు. ఎవరో ఒకరు నడపడం కాదు.. అది ఆంధ్రప్రదేశ్ రాతను మార్చే యాత్ర కాబట్టి… స్వయంగా హరికృష్ణకే స్టీరింగ్ ఇచ్చారు. దాంతో హరికృష్ణ రథ సారథిగా మారిపోయారు.
పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్.. అధికారంలోకి వచ్చారు. చైతన్యరథం ఎక్కిన నందమూరి రాముడ్ని.. ప్రజలకు ముందుకు తీసుకెళ్లింది హరికృష్ణ. అలా అప్పటి నుంచి అప్పటి నుంచి నందమూరి, టీడీపీ అభిమానులకు.. హరికృష్ణ రథసారధిగానే గుర్తుండిపోయారు. నిర్మొహమాటంగా మాట్లాడటం, అభిమానుల పట్ల ఆప్యాయంగా వ్యవహరించేవారు. తండ్రికి చేదోడువాదోడుగా ఉన్నా.. మొదట్లో ఆయన రాజకీయాలపై ఆసక్తి చూపించలేదు. తండ్రికి వీలైనంత సాయంగా ఉండటానికే ఇష్టపడ్డారు. 35 సంవత్సరాలు ఓ తండ్రి కోసం, తండ్రికి తోడుగా .. హరికృష్ణ ప్రయాణం సాగింది. ఎన్టీఆర్ ఎంత క్రమశిక్షణతో ఉండేవారో అందరికీ తెలుసు. అలాంటి క్రమశిక్షణను.. కుమారులు తప్పినా సహించేవారు కాదు. అయినా హరికృష్ణ ఎప్పుడూ.. తండ్రితో చిన్న మాట కూడా పడకుండా… ఆయనతో తన ప్రయాణాన్ని కొనసాగించారు.
తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో పడినప్పుడు.. ఆ పార్టీని కాపాడుకోవడానికి ముందడుగు వేసిన వారిలో హరికృష్ణ కూడా ఉన్నారు. లక్ష్మిపార్వతి తీరుతో.. తెలుగుదేశం పార్టీతో పాటు .. ఎన్టీఆర్ ప్రతిష్ట కూడా మంట గలిసిపోతోందన్న ఉద్దేశంతో… హరికృష్ణ ముందడుగు వేశారు. చంద్రబాబు నేతృత్వంలో ఇతర పార్టీ నేతలందరితో కలిసి… ఆగస్టు సంక్షోభం నుంచి పార్టీని బయటపడేశారు. ఆ తర్వాత ఆయన రవాణా మంత్రిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యునిగా కూడా వ్వహరించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా.. 2013లో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్గా కొనసాగుతున్నారు.
హరికృష్ణ సినీరంగంలోనూ.. తనదైన ముద్ర వేశారు. ఎన్టీఆర్ రూపు రేఖలు ఉండటంతో.. ఆయన 1998 నుంచి సినిమాల్లో యాక్టివ్ అయ్యారు. అంతకు రెండు దశాబ్దాల ముందే నటన ఆపేసినా… 1998లో పరిటాల రవి నిర్మించిన శ్రీరాములయ్య సినిమాతో మళ్లీ తెర మీదకు వచ్చారు. ఆ తర్వాత ఆ క్రేజ్ ఓ రేంజ్లో సాగింది. సీతయ్య సినిమాకు… ఓపెనింగ్స్.. అప్పటి స్టార్ హీరోలను మించిపోయే విధంగా ఉన్నాయి. 2005లో శ్రావణమాసం అనే సినిమా తర్వాత ఆయన సినీరంగం నుంచి విరమించుకున్నారు. హరికృష్ణ.. మృతి అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సినీ, రాజకీయ రంగాల్లో అజాతశతృవు లాంటి… హరికృష్ణ.. ఇక లేరనే వార్త అందర్నీ ఆవేదనకు గురి చేస్తోంది.