ముసునూరు తహసిల్దార్ వనజాక్షిని తక్షణమే ఊరు వదిలి వెళ్ళిపొమ్మని బెదిరింపు లేఖలు వస్తున్న సంగతి తెలుసుకొని ముందుగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఉండాలి. కానీ నందమూరి హరికృష్ణ స్పందించడం విశేషం. ఆమెకు అండగా ఉంటానని హరికృష్ణ ప్రకటించారు. ఆమెకు బెదిరిస్తూ ఆ విధంగా లేఖలు వ్రాసినవారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు. అదే విధంగా రిషితేశ్వరి ఆత్మహత్యకు బాధ్యులయిన వారిపై కూడా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
ఈ రెండు కేసులలో ప్రభుత్వం తన చేతికి మట్టి అంటకుండా బయటపడాలని ప్రయత్నిస్తోంది. వనజాక్షి కేసులో ఆమెదే తప్పని తేల్చి చెప్పేసి ఆమె నోరు మూయించే ప్రయత్నం చేసింది. రిషితేశ్వరి కేసులో ఎవరినీ కూడా విడిచిపెట్టబోము అని మంత్రి ‘గంటా’ పదంగా చెపుతున్నప్పటికీ, ఆమె తల్లి తండ్రులకి నష్టపరిహారంగా కొంత సొమ్ము, భూమి ఇచ్చి వాళ్ళని కూడా మాట్లాడనీయకుండా చేసారు. ఈ రెండు వ్యవహారాలలో తెదేపా నేతలెవ్వరూ కూడా తలదూర్చే ప్రయత్నం చేయలేదు. కనీసం బాధితులు వనజాక్షి, రిషితేశ్వరి తరపున సానుభూతిగా మాట్లాడేందుకు కూడా ప్రయత్నించలేదు. కారణం ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకూడదనే. కానీ హరికృష్ణ మాత్రం వారిద్దరి తరపున మాట్లాడటం విశేషం.
కానీ వారికి అన్యాయం జరిగింది కనుక ఆయన వారి తరపున మాట్లాడారనుకొంటే పొరపాటే! ఎందకంటే ఆయన వారికి మద్దతుగా మాట్లాడినప్పటికీ ఆయన ఉద్దేశ్యం మాత్రం వేరే ఉందని చెప్పవచ్చును. తెలుగుదేశం పార్టీలో తనకు, తన కుమారుడు జూ.ఎన్టీఆర్ కి సరయిన గౌరవం దక్కడం లేదనే కారణంగా నందమూరి హరికృష్ణ చాలా కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి సందర్భాలలో ఆయన మాట్లాడుతూ పార్టీలో తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తుంటారు. పార్టీలో ఎవరూ కూడా ఆయన మాటలని బహిరంగంగా సమర్దించలేరు అలాగని ఖండించనూ లేరు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తనకున్న అసంతృప్తిని హరికృష్ణ అప్పుడప్పుడు ఈవిధంగా మాట్లాడుతూ బయటపెట్టుకొంటారు అంతే! ఆమెకు అండగా నిలబడాలనే ఉద్దేశ్యమే ఆయనకి ఉంటే, ఆమెపై తమ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని దాడి చేసినప్పుడో, లేదా ముఖ్యమంత్రి ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తున్న సమయంలోనో ఆయన ఆమెకు అండగా నిలబడేవారు. కానీ అప్పుడు ఆయన కూడా నోరు విప్పలేదు. కనుక ఆయనేదో ఇప్పుడు మాట వరసకి ఆమెకి అండగా నిలబడతానని చెపుతున్నంత మాత్రాన్న ఆయన నిజంగానే ముసునూరు వెళ్లి ఆమెకు అండగా నిలబడతారనుకోనవసరం లేదు.