నందమూరి అభిమానులంతా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ యేడాది మోక్షు ఎంట్రీ ఉంటుందని, హీరోగా ఓ సినిమా చేయడం ఖాయమని అనుకొన్నారు. ప్రశాంత్ వర్మతో సినిమా పూజా కార్యక్రమాల వరకూ వెళ్లి ఆగిపోయింది. ఆ తరవాత.. చాలామంది దర్శకుల పేర్లు వినిపించాయి. బాలకృష్ణ స్వయంగా మోక్షజ్ఞని పరిచయం చేస్తారని, ఆదిత్య 369 సీక్వెల్ లో మోక్షజ్ఞ కనిపిస్తాడని ప్రచారం జరిగింది. అయితే… ఇప్పుడు మరో అప్ డేట్ వచ్చింది.
మోక్షజ్ఞ ఎంట్రీ.. ప్రశాంత్ వర్మ సినిమాతోనేనని, అయితే అందుకోసం ఇంకొంత సమయం ఎదురు చూడాలని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘జై హనుమాన్’ పనుల్లో ఉన్నాడు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ‘జై హనుమాన్’ ముగిసిన తరవాత.. మోక్షజ్ఞ సినిమాని మొదలెడతాడట ప్రశాంత్ వర్మ. ఇందుకు బాలకృష్ణ కూడా అంగీకారం తెలిపారని సమాచారం. ఈలోగా మోక్షజ్ఞ నటన, తదితర విభాగాల్లో మరింత శిక్షణ తీసుకొంటాడని తెలుస్తోంది. మోక్షజ్ఞ తొలి సినిమా ప్రశాంత్ వర్మతోనే అని, అందుకు ఆలస్యమైనా ఫర్వాలేదని బాలయ్య భావిస్తున్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘జై హనుమాన్’ చాలా పెద్ద ప్రాజెక్ట్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తారు. ‘కాంతార 2’ పూర్తయిన తరవాతే రిషబ్ శెట్టి ఈ సినిమాకు డేట్లు కేటాయించగలరు. అంతతకంటే ముందే ఈ సినిమా పట్టాలెక్కించాలని, ఆ తరవాత రిషబ్ జాయిన్ అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఎలా కాదన్న 2025 మొత్తం ‘జై హనుమాన్’తోనే సరిపోతుంది. అంటే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం మరో యేడాది ఆగాల్సిందేనన్నమాట.