సీమాంధ్రులు మెజార్టీగా ఉన్న కూకట్పల్లి నియోజకవర్గంలో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని బరిలో దింపాలని చంద్రబాబు నిర్ణయించడం రాజకీయవర్గాల్లో ఓ హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ విషయం.. నామినేషన్లు ప్రారంభమయ్యే వరకూ బయటకు రాలేదు. ఆ తర్వాత పరిణామాలు వేగంగా సాగిపోయాయి. 48 గంటల్లోనే సుహాసిని రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన చర్చలను.. కుటుంబం పూర్తి చేసింది. అధికారిక కార్యక్రమానికి వెళ్లిన చంద్రబాబును.. విశాఖలో .. సుహాసిని కలిశారు. రాజకీయ ప్రవేశంపై మొత్తం మాట్లాడారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. కూకట్ పల్లి టీడీపీ నేతల అభిప్రాయం తెలుసుకుని.. అధికారికంగా ప్రకటించారు.
హరికృష్ణ ప్రమాదంలో మృతి చెందిన తర్వాత ఆయన కుటుంబానికి రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించాలని చంద్రబాబు భావించారు. మొదటగా హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ ను కూకట్పల్లి నుంచి పోటీకి దింపాలని భావించారు. ఆయన రాజకీయాలపై ఆసక్తి కనబర్చలేదు. దాంతో టీడీపీ అగ్రనేతలు కూకట్ పల్లిలో ప్రత్యామ్నాయాలవైపు చూశారు. అదే సమయంలో రాజకీయాల్లోకి వచ్చేందుకు సుహాసిని ఆసక్తి కనబరిచారు. చంద్రబాబు కూడా.. అంగీకరించారు. సుహాసినిని.. కూకట్ పల్లి బరిలో నిలబెట్టి గెలిపించడం.. పెద్ద కష్టం కాదు. అందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా.. ఈ నిర్ణయం తీసుకున్నారు. సుహాసిని బరిలో నిలిస్తే.. నందమూరి కుటుంబం మొత్తం మద్దతు తెలుపుతుంది. వ్యతిరేకించే వారు ఎవరూ ఉండరు. బీజేపీలో ఉన్న పురంధేశ్వరి మాత్రం. ఈ విషయంలో మద్దతు తెలియజేయలేరు. అలాగని ఆమె కూడా వ్యతిరేకించలేరు.
హరికృష్ణ మరణం తర్వాత నందమూరి బాలకృష్ణ అబ్బాయిలకు అండగా ఉంటున్నారు. ఎన్టీఆర్ సినిమా విజయోత్సవానికి కూడా హాజరయ్యారు. సుహాసిని తరపున బాలకృష్ణతో పాటు… జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సహా.. కుటుంబం అంతా ప్రచారం చేసే అవకాశం ఉంది. అంటే కూకట్ పల్లిలో కుటుంబం అంతా కలసి రావడం ఖాయం. అదే జరిగిదే… నందమూరి కుటుంబం మొత్తం ఏకతాటిపై ఉందని.. అది కూడా.. తెలుగుదేశం పార్టీ వెనుకే ఉందని.. బలమైన సంకేతాలను… ప్రజల్లోకి పంపినట్లవుతుంది. అదే సమయంలో… హరికృష్ణను కోల్పోయిన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని.. సుహాసినికి టిక్కెట్ ఇవ్వడం ద్వారా భరోసా ఇచ్చినట్లవుతుంది. ఓ రకంగా చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం కుటుంబం మొత్తం టీడీపీ వైపే ఉందని..మరోసారి నిరూపించడానికి ఉపయోగపడుతోంది.