కూకట్ పల్లి అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున.. నందమూరి హరికృష్ణ కుమార్తె…నందమూరి సుహాసిని పేరును ప్రకటించారు. నిన్న కూకట్‌పల్లికి చెందిన టీడీపీ నాయకుల్ని అమరావతికి పిలిపించి మాట్లాడిన… చంద్రబాబు… ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇస్తున్నందున.. సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టిక్కెట్ వస్తుందని.. గట్టిగా ఆశించిన కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావుకు.. భవిష్యత్‌లో అవకాశాలు కల్పిస్తానని.. చంద్రబాబు హామీ ఇచ్చారు. టిక్కెట్ వచ్చినట్లే భావించి ప్రచారం కూడా.. ప్రారంభించిన పెద్దిరెడ్డి.. చంద్రబాబుతో సమావేశానికి పిలుపు అందినా రాలేదు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని సమాధానం ఇచ్చారు. దాంతో.. కూకట్పల్లి నేతలతో సమావేశం ముగిసిన వెంటనే… నందమూరి సుహాసిని అభ్యర్థిత్వాన్ని… తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆమె శనివారం నామినేషన్ దాఖలు చేస్తారు. అందకు ముందు… నందమూరి సుహాసిని.. విశాఖలో.. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. కుటుంబసభ్యులంతా.. ఆమోదించడంతో.. సుహాసినికి లైన్ క్లియర్ అయింది.
నందమూరి సుహాసినికి టిక్కెట్ ఖరారు చేయడంతో… పన్నెండు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించినట్లయింది. మరో రెండు స్థానాలు ఖరారు కావాల్సి ఉంది. సనత్ నగర్, పఠాన్ చెరు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో రెండు స్థానాలు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో సనత్ నగర్ స్థానం తెలుగుదేశం పార్టీకి ఖాయమే. కాంగ్రెస్ తరపున మర్రి శశిధర్ రెడ్డి ఆ స్థానం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నందున.. రాహుల్ గాంధీ.. ఆయనతో మాట్లాడి.. బుజ్జగించిన తర్వాత… టీడీపీకి కేటాయిస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సనత్ నగర్ నుంచి కూన వెంకటేష్ గౌడ్ పేరు ఖరారయినట్లే. ఆయన ఇప్పటికే చురుగ్గా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక పటాన్ చెరు టీడీపీకి కేటాయిస్తే నందీశ్వర్ గౌడ్.., నిజామాబాద్ రూరల్ ఇస్తే.. మండవ వెంకటేశ్వరరావు పోటీ చేస్తారు. మండవ వెంకటేశ్వరరావు పోటీకి ఆసక్తి చూపిస్తే.. మాత్రం.. ఆ స్థానం టీడీపీకే కేటాయించే అవకాశం ఉంది. ఒక వేళ.. పోటీకి తటపటాయిస్తే.. పటాను చెరు స్థానాన్ని టీడీపీ తీసుకుని… ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్‌కు అవకాశం కల్పించనుంది.
ఖమ్మంలో మూడు, వరంగల్ జిల్లాలో ఒకటి, మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటి తీసుకున్న టీడీపీ.. మిగతా తొమ్మిది నియోజకవర్గాలను గ్రేటర్ పరిధిలోనే ఎంచుకుంది. గ్రేటర్ పరిధిలో ఎంచుకున్న స్థానాలపై టీడీపీ నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గం విషయంలో… అభ్యర్థిత్వం ఆశిస్తున్న సామ రంగారెడ్డికి… ఇబ్రహీంపట్నం టిక్కెట్ ఇచ్చారు. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. తనకు ఎల్బీనగరే కేటాయించాలని పట్టుబడుతున్నారు. సామ రంగారెడ్డికి సర్దిచెప్పి.. ఇబ్రహీంపట్నం నుంచే పోటీ చేసేలా ఒప్పించే బాధ్యతను చంద్రబాబు నామా నాగేశ్వరరావుకు అప్పగించారు.