నందమూరి సుహాసిని వారం రోజుల కిందటి వరకు.. ఆమె… సాధారణ గృహిణి. రాజకీయాల గురించి ఆమెకు ఎంత తెలుసో ఎవరికీ తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ తరపున కూకట్పల్లి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మాత్రం.. ఆమె రాజకీయం చేయగలదా అన్న అనుమానాలు చాలా మందికి వచ్చాయి. ఈ విషయంలో ఆమె మెదటి సారి ప్రెస్మీట్లో మాట్లాడినప్పుడు.. ఆ తర్వాత నామినేషన్ సందర్భంలోనూ మాట్లాడినప్పుడు.. ముందుకు చదువుకుని వచ్చి మీడియా ముందు చెబుతోందన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ కారణంగా.. ఆమె కూకట్‌పల్లిలో ఏమి రాజకీయం చేయగలదనున్నవారు చాలా మంది ఉన్నారు. నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటారని..మిగతా పార్టీ నేతలే బరువు బాధ్యతలు మీదేసుకుంటారని అనుకున్నారు. కానీ.. రెండు, మూడు రోజుల్లోనే నందమూరి సుహాసిని.. ఆ అభిప్రాయాన్ని మార్చేశారు.
కూకట్పల్లి నియోజకవర్గ సరిహద్దులను మొత్తం ఔపాసన పట్టి.. పక్కాగా ఆమె ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ..ఆమె కూకట్‌పల్లిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అదీ కూడా.. ఓ పద్దతి ప్రకారం చేస్తున్నారు. టీ టీడీపీ నేతలు.. పెద్దిరెడ్డి, కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు పూర్తిగా సహకరిస్తున్నా….ఓ పద్దతి ప్రకారం వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నారు. కూకట్‌పల్లిలో అసంతృప్తికి గురైన టీడీపీ నేతల్ని కలవడానికి కొంత సమయం కేటాయిస్తున్నారు. అందరి ఇళ్లకు వెళ్లి.. ముకుళిత హస్తాలతో నమస్కరం పెట్టి ఆత్మీయంగా పలకరిస్తున్నారు. మద్దతు అడుగుతున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లకు వెళ్లడానికి కొంత సమయం కేటాయిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున రెబల్‌గా నామినేషన్ గా వేసిన కాంగ్రెస్ నేత ఇంటికి వెళ్లి… కూటమి ధర్మాన్ని పాటించాలని కోరారు. మద్దతు ఇవ్వాలని అడిగారు. అలాగే.. మాధవరం కృష్ణారావుతో పాటు.. టీఆర్ఎస్లోకి వెళ్లి.. సరైన నాయకత్వం లేక అక్కడే ఉండిపోయిన టీడీపీ అభిమానుల్ని మళ్లీ పార్టీలోకి తెచ్చుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ పాటిస్తున్నారు. సుహాసిని వర్కింగ్ స్టైల్ చూసి అందరూ ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.
మొత్తం సమయం అంతా.. నేతల్ని కలవడానికి, పరిచయడం చేసుకోవడానికే వెచ్చించడం లేదు. రోజూ.. పాదయాత్ర చేస్తున్నారు. నియోజకవర్గంలో కీలకమైన బస్తీల్ని పాదయాత్ర ద్వారా కవర్ చేస్తున్నారు. ప్రతి రోజూ.. ఓ షెడ్యూల్ రూపొందిచుకంటున్నారు. ఆయా ప్రాంతంలోని టీడీపీ నేతలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు. ఆమె ప్లానింగ్ చూసి టీడీపీ నేతలు… రిలీఫ్ ఫీలవుతున్నారు. ప్రతీది చెప్పాల్సిన పని లేదని… భావిస్తున్నారు. కార్పొరేటర్ మందాడి శ్రీనిసరావు… సుహాసినిని టీడీపీ క్యాడర్‌కు పరిచయం చేస్తున్నారు. సోషల్ మీడియా విషయంలోనూ..సుహాసిని పక్కాగా ఉన్నారు. రెండు రోజులేక ఆమె పేరుపై కొన్ని అఫీషియల్ ఎకౌంట్లు.. చురుగ్గా పని చేయడం ప్రారంభించాయి. ఆమె షెడ్యూళ్లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నారు. మొత్తానికి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చానన్న భావన రానీయడం లేదు. ఆమె ఎంత పర్ఫెక్ట్గా రాజకీయం చేస్తున్నారంటే.. ఈ అవకాశం కోసమే.. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నట్లుగా.. వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నట్లుగా.. అత్యంత శ్రద్ధగా.. రాజకీయం చేస్తున్నారు. ఈ ఎన్నికలు ముగిసిపోయేసరికి.. నందమూరి సుహాసిని.. తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుటుందని.. టీడీపీ నేతలు … జోస్యం చెప్పేస్తున్నారు.