ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టే ఉండేది. విభజన తరువాత రానురానూ టీడీపీ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఆ పార్టీ ఉనికే తెలంగాణలో ప్రశ్నార్థకం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత తెలంగాణ శాఖను అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా పెద్దగా పట్టించుకోవడం మానేశారు. అలాగని, రాష్ట్రంలో బలమైన నాయకులున్నారా అంటే, అదీ లేని పరిస్థితి ఇప్పుడు! తెలంగాణ శాఖను ఎవరు ముందుకు తీసుకెళ్తారనే సందిగ్ధావస్థలో టీడీపీ ఉంది. ఈ మధ్య టీటీడీపీ మీద అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొంత శ్రద్ధ పెడుతున్నా… పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఆయన వారాంతాల్లో మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉండగలుగుతున్నారు. టీడీపీకి కొంతైనా పట్టు పెరగాలంటే ఆకర్షణీయమైన నాయకత్వం అవసరం ఉందని పార్టీ భావిస్తోంది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుటుంబానికి చెందినవారికి కీలక బాధ్యతలు అప్పగిస్తే, తెలంగాణలో టీడీపీకి కొంత ఆకర్షణ పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ప్రస్తుతం వినిపిస్తున్న పేరు… నందమూరి సుహాసిని.
టీటీడీపీ కేడర్లో తాజాగా ఈ చర్చే జరుగుతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ మనవరాలిగా ఆమెకు తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే కొంత అటెన్షన్ వస్తుందని అంటున్నారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా సుహాసిని పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి, నందమూరి హరికృష్ణ మరణం తరువాతి వరకూ ఆమె రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నది ఎప్పుడూ లేదు. ఎన్నికల్లో ఓడిపోయినా, ఎన్టీఆర్ మనవరాలిగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆమె ఇకపై కనిపించే అవకాశం లేదని అనుకుంటున్నారంతా. కానీ, అందుకు భిన్నంగా ఆమె పార్టీ కార్యక్రమాల్లో కొంత క్రియాశీలంగా ఉండే ప్రయత్నమే చేస్తున్నారు. ఆమెకి కీలక బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనీ, టీడీపీకి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉండొచ్చనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతోందని సమాచారం. దీనిపై త్వరలో అధికారికంగా ఒక ప్రకటన కూడా రావొచ్చనీ అంటున్నారు.
ఒకటైతే వాస్తవం… టీటీడీపీ ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు తెరాస, కాంగ్రెస్ లతోపాటు ఎదగాలన్న ఉత్సాహంలో భాజపా ఉంది. ఈ రేసులో టీడీపీ ఉనికే లేదు. పైగా, కాస్తోకూస్తో మిగులున్న నాయకులు, కిందిస్థాయి కేడర్ కూడా దాదాపుగా ఇతర పార్టీల్లోకి వలస వెళ్లిపోయిన పరిస్థితి. ప్రజల తరఫున ఉద్యమాలుగానీ, అధికార పార్టీని ప్రశ్నించే స్థాయి నిరసనలుగానీ టీడీపీ చేస్తున్న దాఖలాలూ లేవు. ఈ పరిస్థితి నుంచి పార్టీ పునరుద్ధరించాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. కేవలం సంస్థాగతంగానే కాదు, వ్యవస్థీకృతంగా టీటీడీపీ మారాల్సింది చాలా ఉంది. జనాకర్షణతోపాటు, సమర్థ నాయకత్వం అవసరం ఉంది.