జనసేన పార్టీలో నెంబర్ వన్‌లో… పవన్ కల్యాణ్ ఉంటారు. నెంబర్ టూలో ఎవరు ఉంటారు..?. అది సీజన్‌ను బట్టి ఉంటుంది. మహా అయితే ఆరు నెలలకోసారి.. ఒకరు మారిపోతూ ఉంటారు. మొదట్లో.. జనసేన పార్టీ అంటే.. పవన్ కల్యాణ్ తర్వాత అందరూ చెప్పుకునే పేరు మారిశెట్టి రాఘవయ్య. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు…? పార్టీలోకి కొత్త నీరు వచ్చిన తర్వాత ఆయనను… మెల్లగా బయటకు పంపేశారు. ఆయనకు ఇప్పుడు పార్టీలో ఏ రోల్ లేదు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ తర్వాత మాదాసు గంగాధరం, తోట చంద్రశేఖర్ లాంటి నేతలు వచ్చారు. కొన్ని మీడియాలను కొని..జనసేనకు అటాచ్ చేశారు. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ వచ్చారు. ఇప్పుడు ఆయనే జనసేన నెంబర్ టూ. పవన్ కల్యాణ్ పక్కన ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు.
త్వరలో నాదెండ్ల మనోహర్ ను కూడా జరుగు.. జరుగు అనే లీడర్లు వస్తున్నారు. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. జనసేన పార్టీలో చేరడానికి వారు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారిలో ఒకరు కడప జిల్లా నేత, మాజీ మంత్రి మైసూరారెడ్డి. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన మైసూరారెడ్డి … వైఎస్‌తో విబేధించి టీడీపీలో చేరారు. టీడీపీలో ఆయనకు రాజ్యసభ సీటు వచ్చింది. రాజ్యసభ టెర్మ్ పూర్తయ్యే సరికి.. రెన్యూవల్ చేసే అవకాశం లేదని తేలిపోయే సరికి.. వెళ్లి వైసీపీలో చేరిపోయారు. అప్పట్లో జగన్ జైల్లో ఉండటంతో… పార్టీ వ్యవహారాలు మొత్తం ఆయనే చూసుకున్నారు. కానీ జగన్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయనను ఇంటికి పంపించేశారు. దాంతో.. పూలమ్మిన చోట కట్టెలమ్మలేక బయటకు వచ్చారు. మళ్లీ టీడీపీలోకి వద్దామని ప్రయత్నించారు కానీ… సమీకరణాలు కుదరలేదు. మధ్యలో రాయలసీమ వాదం పేరుతో.. ఏదో చేద్దామనుకున్నారు… ఓపిక తక్కువ అవడంతో ఆగిపోయారు. ఇప్పుడు.. జనసేన పార్టీలో మళ్లీ.. వ్యవహారాలన్నీ… చక్కబెట్టే అవకాశం వస్తుందనే ఉద్దేశంతో.. ఆ పార్టీ వైపు చూస్తున్నారు.
మైసూరారెడ్డి… చాలా సీనియర్ నేత. ఆయనను పార్టీలో చేర్చుకుని పక్కన అలా కూర్చోబెట్టలేరు. ఆలా కూర్చోవడానికో.. ఏదో ఓ అసెంబ్లీ సీటుకో.. పార్లమెంట్ సీటుకో పోటీ చేయడానికో ఆయన పరిమితం కారు. తన రాజకీయ అనుభవంతో తాను.. జనసేన బాధ్యతలన్నింటినీ తీసుకుంటారు. ఆయనకు ఉన్న సీనియార్టీ కారణంగా.. పవన్ కూడా.. అందుకు ఒప్పుకోక తప్పదు. అంటే మైసూరారెడ్డి చేరిన తర్వాత.. పవన్ కల్యాణ్ పక్కన మైసూరారెడ్డి కనిపిస్తారు. కొన్నాళ్లు.. నాదెండ్లు, మైసూరా ఇద్దరూ కనిపించవచ్చు. కొన్నాళ్ల తర్వాత మైసూరా ఒక్కరే ఉండొచ్చు. ఆ తర్వాత సంగతి చెప్పలేము..!