హైకోర్టు మీద నేరుగా ఆరోపణలు చేయడానికి వైసీపీ నేతలు ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఎంపీ నందిగం సురేష్‌కు ఆ పార్టీ హైకమాండ్ ఆ బాధ్యతలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొన్న.. ఇంగ్లిష్ మీడియం తీర్పులు ఇస్తున్న న్యాయమూర్తుల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని ప్రశ్నించిన ఆయన ఇప్పుడు మరింత నేరుగా.. హైకోర్టుపై విమర్శలు ప్రారంభించారు. హైకోర్టులో న్యాయమూర్తులు ఇస్తున్న తీర్పులు చంద్రబాబుకు ముందే తెలిసిపోతున్నాయని.. అలా ఎలా తెలుస్తున్నాయని..తక్షణం చంద్రబాబు కాల్ లిస్ట్‌పై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అంటే..చంద్రబాబు హైకోర్టు న్యాయమూర్తులకు ఫోన్ చేస్తున్నట్లుగా.. నందిగం సురేష్ చెప్పినట్లయింది.
తీర్పులు చంద్రబాబుకు ముందే తెలుస్తున్నాయని ఆరోపించిన నందిగం సురేష్.. దానికి సాక్ష్యంగా.. తీర్పు వచ్చిన వెంటనే.. సోషల్ మీడియాలో చంద్రబాబు పోస్టులు పెట్టడాన్ని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తీర్పు వచ్చిన ఒక్కక్షణంలో అందరికీ తెలిసిపోతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. తెలిసిన తర్వాత పోస్టులు పెడితే.. తీర్పు ముందే తెలియడం ఎలా అవుతుందో ఎంపీ క్లారిటీ ఇవ్వలేకపోయారు. కోర్టులను మేనేజ్ చేసుకుంటూ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని సురేష్ మండిపడ్డారు. సుధాకర్ వెనుక చంద్రబాబు ఉన్నారని చెప్పిన వైసీపీ నేతలు.. అదే విషయంలో.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడానికి కూడా చంద్రబాబే కారణం అని ప్రచారం చేస్తున్నారు.
ఏపీ సర్కార్ కు వ్యతిరేకంగా ఏం జరిగినా…చంద్రబాబే చేయించారని.. ఆరోపణలు చేయడానికి ఇప్పటి వరకూ వైసీపీ నేతలు వెనుకాడేవారు కాదు. అయితే.. ఇప్పుడు ఏకంగా న్యాయవ్యవస్థపైనా చంద్రబాబు ముద్ర వేసేందుకు ప్రయత్నించడమే… రాజకీయవర్గాల్లోనూ కలకలం రేపుతోంది. ఇప్పటి వరకూ బీజేపీ నేతలు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారు టీడీపీకి అమ్ముడుపోయారని ఆరోపించేవారు. జనసేన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తే..చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకున్నారని ఆరోపించేవారు. రాజకీయంగా ఆరోపణలు చెల్లుతాయి కాబట్టి సరిపోయింది కానీ.. ఇప్పుడు..చట్ట విరుద్ధంగా.. రాజ్యాంగ విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలు కోర్టులు కొట్టి వేస్తూంటే… కోర్టులపైనా చంద్రబాబు ప్రభావం ఉందని.. ఆయన మేనేజ్ చేస్తున్నారని ప్రచారం చేయడానికి ఏ మాత్రం వెనుకాడకపోవడం… అందర్నీ విస్మయపరుస్తోంది.