తిరుమల లడ్డూ వాసనే లేదు. ఆ లడ్డూ తింటే నెయ్యిలో ముంచినట్లు ఉంటుండే… తిరుపతి అంతా మారిపోయింది. ఈ మాటలకు ఇక పుల్ స్టాప్ పడనుంది. గతంలో ఉన్నట్లుగానే తిరుమల వెంకన్న లడ్డూ మళ్లీ పాత రుచితో, క్వాలిటీతో రాబోతుంది.
ఏపీలో జగన్ అధికారంలోకి రావటం, జగన్ సర్కార్ తెచ్చిన కొత్త తిరుమల తిరుపతి బోర్డు వైసీపీ నేతలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంది. అధికారులు కూడా వంత పాడటంతో… తిరుమల శ్రీవారికే శఠగోపం పెడుతూ వచ్చారు. ఎంతగా అంటే ప్రజలే కాదు మఠాధిపతులు చెప్పినా వినే పరిస్థితి లేకపోయింది. ఫలితంగా తిరుమల లడ్డూ కూడా విశిష్టతను కోల్పోతుంది అన్న భయాన్ని భక్తులు వ్యక్తం చేశారు. క్యూలైన్ లో ఉన్న వారికి అన్న ప్రసాదాలు అందించ లేదు. అడ్డగోలు నిబంధనలు పెట్టి, భక్తులను గంటలు గంటలు క్యూ లైన్లో నిల్చబెట్టారు.
కానీ, కొత్త సర్కార్ రాగానే ప్రక్షాళన మొదలుపెట్టగా… ఇప్పుడు అన్న ప్రసాదాల క్వాలిటీపై ఫోకస్ చేశారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డూ పాత క్వాలిటీతో ఇచ్చేలా చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వం అంతకు ముందు సరఫరా చేసిన కర్నాటక ప్రభుత్వ పాడి సంస్థ నందిని డైరీ నెయ్యి సరఫరా నిలిపివేసింది. ఆ స్థానంలో యూపీకి చెందని ఆల్ఫా అనే సంస్థ నుండి నెయ్యిని కొనుగోలు చేసింది. తిరుమలలో ప్రతి రోజు 10వేల కేజీల నెయ్యిని వినియోగిస్తుంది. కేజీ ధర 470రూపాయలుగా సరఫరా చేస్తుంటారు. ఇప్పుడు యూపీ నెయ్యికి గుడ్ బై చెప్పి తిరిగి కర్నాటక నందిని డెయిరీ నెయ్యి సప్లైని మళ్లీ స్టార్ట్ చేశారు. నెలకు దాదాపు 350 టన్నుల నెయ్యిని సరఫరా చేస్తుంటారు. ఇంత పెద్ద ఎత్తున సరఫరా చేసే సామర్థ్యం నందిని డెయిరీకి మాత్రమే ఉంది. పైగా పాత ధరకే వారు ముందుకు రావటంతో టీటీడీ ఓకే చెప్పింది. ముందుగా రెండు ట్యాంకర్ల నెయ్యిని ఇప్పటికే తిరుమలకు పంపారు.
తిరుమల శ్రీవారి ప్రసాదాలకు కర్నాటక నెయ్యిని ఎంపిక చేయటంతో… ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్వయంగా ట్యాంకర్లకు జెండా ఊపి పంపించారు.
ఈ చర్యలతో టీటీడీ లడ్డూ క్వాలిటీ, అన్నప్రసాదాల నాణ్యత పెరుగుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.