ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డిజిపిగా చేస్తున్న జెవి రాముడు ఈనెల 23న పదవీ విరమణ చేయవలసి ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి రెండు నెలలు పదవీ కాలం పొడిగించినట్లు వార్తలు వచ్చాయి. మళ్ళీ ఇవ్వాళ్ళ మరో తాజా వార్త వచ్చింది. ఆయన 23నే పదవీ విరమణ చేయబోతున్నారని ఆయన స్థానంలో కొత్త డిజిపి నియమితులయ్యే వరకు ఏపిఎస్ ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న నండూరి సాంభశివరావుని ఇన్-ఛార్జ్ డిజిపిగా నియమితులవుతున్నట్లు తాజా సమాచారం. మళ్ళీ పూర్తిస్థాయి డిజిపి నియామకం కోసం పద్ధతి ప్రకారం సీనియర్ ఐపిఎస్ అధికారుల పేర్లని కేంద్రానికి పంపిస్తే అది ఆ జాబితాని యు.పి.ఎస్.సి.కమిటీకి పంపిస్తుంది. వారిలో ముగ్గురి పేర్లని అది సూచిస్తుంది. అ ముగ్గురిలో నుంచి రాష్ట్ర ప్రభుత్వం తనకి నచ్చిన వారిని ఒకరిని డిజిపిగా నియమించుకొంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు నండూరి సాంభశివరావు ఇన్-ఛార్జ్ డిజిపిగా వ్యవహరిస్తారు.
ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐ.వై.ఆర్. కృష్ణారావు, డిజిపి రాముడు ఒకేసారి బాధ్యతలు చేపట్టారు. వారిలో కృష్ణారావు ముందుగా రిటైర్ అయ్యారు. ఇప్పుడు రాముడు కూడా రిటైర్ అవుతున్నారు. వారిద్దరికీ రాష్ట్ర ప్రభుత్వం పదవీకాలం పొడిగించలేదు. కృష్ణారావుని మాత్రం బ్రాహ్మణ కార్పోరేషన్ కి చైర్మన్ గా నియమించింది. డిజిపి రాముడికి రెండు నెలలు పదవీ కాలం పొడిగించినట్లు వార్తలు వచ్చేయి కానీ అవి నిజం కావని తేలిపోయింది. డిజిపి రాముడు పదవీ కాలంలో ఆద్యంతం అనేక సవాళ్ళని ఎదుర్కోవలసి వచ్చింది. ఓటుకి నోటు కేసు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, కాల్ మనీ కేసులు, గోదావరి పుష్కరాల నిర్వహణ, తుని విద్వంసం కేసు, ఆ తరువాత మళ్ళీ ముద్రగడ దీక్ష కారణంగా ఉద్రిక్తతలు వంటి అనేక సవాళ్ళని ఎదుర్కోవలసి వచ్చింది.