యథా రాజా తథా ప్రజా అన్నట్టే యథా లీడర్లు తథా ఓటర్లు అని చెప్పాలి. ఎపి రాజకీయాలలో నంద్యాల ఉప ఎన్నిక కీలకమైన మలుపు అని అందరూ అంగీకరిస్తున్నారు. కాని ఆ మలుపు ఎలా వుంటుంది? దాంట్లో నలుపు ఎంత వుంటుంది? అనేది దాటేస్తున్నారు. టిడిపి వైసీపీ నాయకులు ఉభయులూ టఫ్ పోటీ అని ఒప్పుకుంటున్నారు. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వుందంటే అంగీకరిస్తున్నారు. అయితే ఆ కారణంగా పాలకపక్షం ఖచ్చితంగా ఓడిపోతుందని చెప్పడానికి చాలా మంది సిద్ధపడటం లేదు. సర్వ శక్తులూ ఒడ్డే టిడిపి అధినేత చంద్రబాబు వ్యూహం విపరీతంగా పనిచేస్తుంటే రెండోవైపు అంత జోరు అందుకోవడం లేదన్న భావం వుంది. శిల్పా మోహనరెడ్డి వంటి బలమైన నాయకుడు వచ్చి వుండకపోతే వైసీపీ పోటీ ఇంత బలంగా కూడా వుండేది కాదని చాలామంది ఉద్దేశం. అయినా ఫలితంపై అప్పుడే జోస్యాలకు ఎవరూ సిద్ధం కావడం లేదు. కానిఅక్కడి స్థానికుల మాటల గురించి మాత్రం రాజకీయేతరులు కొన్ని కబుర్లు చెప్పారు. అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరవలసిందేనన్న ఫిరాయింపు లాజిక్ అక్కడ ఓటర్లు కూడా చెబుతున్నారట. అఖిలప్రియ ప్రభావం పెద్దగా లేకున్నా సాక్షాత్తూ లోకేశ్ ప్రమేయంతోనే పనులు మొదలై పోవడంతో మేము గెలిస్తే ఇక నంద్యాల నందనమే కదా అన్నట్టు టిడిపి వారు వూదరగొట్టడం బాగానే ప్రభావం చూపిస్తున్నదట. ఇక వైసీపీ మాజీ మంత్రి ఏం మంత్రం వేస్తారో చూడాలి.