నంద్యాల ఫలితాలొచ్చేశాయి. వాటి మీద విశ్లేషణలు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ ఫలితాలు ప్రశాంత్ కిషోర్ మీద కూడా ప్రభావం చూపిస్తాయని కొందరు, అసలు ప్రశాంత్ కిషోర్ కావాలనే జగన్ ని మిస్ లీడ్ చేస్తున్నారని కొందరు, ప్రశాంత్ కిషోర్ ఉత్తరాది కి సరిపోతాడు కానీ దక్షిణాది కి కాదు అని ఇంకొందరు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. అసలెవరీ ప్రశాంత్ కిషోర్, ఆయన తదుపరి కార్యాచరణ ఎలా ఉండొచ్చో చూద్దాం.
ప్రశాంత్ కిషోర్ బేసిగ్గా ఒక డాక్టర్. భారత దేశం లో పౌష్టికాహార లోపం అనే సమస్య పేద రాష్ట్రాల్లోనే కాదు, గుజరాత్ లాంటి ధనిక రాష్ట్రాల్లోనూ విస్తృతంగా ఉందని నిరూపిస్తూ వ్రాసిన మెడికల్ పేపర్ కారణంగా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ కళ్ళల్లో పడ్డాడు. తర్వాత మోడీ ఆహ్వానం మేరకు గుజరాత్ లో ఆరోగ్య శాఖ కి సంబంధించిన సలహాలు ఇవ్వడానికీ, పౌష్టికాహార లోపానికి సంబంధించి గుజరాత్ లొ సమగ్ర సర్వే నిర్వహించడానికీ అనధికారంగా నియమించబడ్డాడు. ఇక సర్వే చేయడానికి నియమింపబడ్డ తమ బృందం క్షేత్ర స్థాయి లో పనిచేయడం తో పాటు గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకుని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బిజెపి గెలుపుకి సాయం చేసింది. దాంతో 2014 ఎన్నికల్లో కూడా మోడీ కి అదే తరహా లో వ్యూహకర్త గానూ, ప్రజానాడి ని తెలుసుకోవడం, సోషల్ మీడియాని ప్రభావితం చేసే కాంపెయిన్స్ రూపొందించే బృందానికి లీడర్ గానూ పనిచేసి, తన మిషన్ లో విజయవంతం అయ్యాడు. ఆ తర్వాత కూడా, బీహార్ లో నితీష్ కి, పంజాబ్ లో కాంగ్రెస్ కి ఇలానే విజాయలందిచ్చాడు. వీటిలో ఒక్క యుపి ఫలితం మాత్రమే తేడా కొట్టింది. ఆ స్థాయి లో మళ్ళీ షాక్ కొట్టింది కేవలం నంద్యాల లోనే.
నంద్యాల ఫలితాల అపజయాన్ని పూర్తిగా ప్రశాంత్ కిషోర్ మీదకు వేయడం కూడా సరికాదు. కానీ జగన్ అనాలోచితంగా ప్లీనరీ లో ప్రశాంత్ కిషోర్ ని సినిమాల్లో భారీ ఇంట్రడక్షన్ లాగా పరిచయం చేయడం వల్ల, ఈ అపజయం ప్రశాంత్ కిషోర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసినట్టయింది. వ్యూహకర్త అనేవాడు తెర వెనక ఉంటెనే అన్నిరకాలుగా మంచిదనే విషయాన్ని జగన్ విస్మరించడం ఆశ్చర్యం. అయితే రాజకీయ వ్యూహకర్త గానే కెరీర్ ని కొనసాగిస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇమేజ్ అలా కొనసాగాలంటే జగన్ ని 2019 లో గెలిపించడం ప్రశాంత్ కిషోర్ కి అత్యవసరం. ఉప ఎన్నిక కాబట్టి, ప్రత్యేక పరిస్థితులు ఉంటాయని అన్ని రాజకీయ పక్షాలకి తెలుసు. అందువల్ల నంద్యాల ఓటమి ప్రశాంత్ కిషోర్ కెరీర్ కి నష్టం కలిగించకపోవచ్చు. కానీ 2019 ఫలితం మాత్రం ఖచ్చితంగా పీకె కెరీర్ ని ప్రభావితం చేస్తుంది. సో, 2019 ఆషామాషీ కాదు అని ప్రశాంత్ కిషోర్ కి తెలిసేలా చేయడానికి ఉపయోగపడ్డ నంద్యాల ఫలితాలు, ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాలు సరిచేసుకొవడానికి, మరింత ఎక్కువగా కష్టపడటానికీ ఖచ్చితంగా దోహదం చేస్తాయి. కాకపోతే, ఆ వ్యూహాలు సలహాలు జగన్ ఎంతవరకు తీసుకుంటాడు, ఈ ఎత్తులకి పై ఎత్తులు అవతలివాళ్ళు వేసినప్పుడు – ప్రశాంత్ కిషోర్ ,జగన్ ఎలా ప్రతిస్పందిస్తారు అనేదాని మీద తుది ఫలితాలు ఆధారపడి ఉంటాయి.