ఎన్నికలు గెలవడానికి అదృష్టమొక్కటే సరిపోదు. సెంటిమెంటు ఈ రోజుల్లో అంతకంటే పనిచేయదు. విషం చల్లి లబ్ధి పొందుదామనే చర్యలకు అసలిది కాలమే కాదు. అనుభవం.. ఏ రంగంలోనైనా విజయాలను ఆస్వాదిస్తుంది. నంద్యాల ఉప ఎన్నికలో ఇప్పుడు ఇదే కీలకం కాబోతోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా ఓటరు ఎలాగైతే అనుభవానికి ఓటేశారో ఇప్పుడూ అదే పునరావృతమవుతుంది. ప్రచారం ఎన్నికలో ఒక భాగం మాత్రమే. వ్యూహానిదే కీలక స్థానం. ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలింగుకు ముందు రోజు అంటే మంగళవారం నాడు తిరుగులేని పాశుపతాస్త్రాన్ని విడిచిపెట్టారు. ప్రతిపక్ష నేతను గురిపెట్టి వదిలిన ఈ అస్త్రం తన పని అది చేస్తుంది. ఇలా ప్రభావం చూపింది అని చెప్పుకోవడానికి లేదు. ఎన్నికల ఫలితం దీన్ని నిర్థారిస్తుంది. ముఖ్యమంత్రిపై జగన్మోహన్ రెడ్డి చేసిన పరుష వ్యాఖ్యలకు సమాధానం చెప్పారు. ఏమిటా మాటలు.. సహనం లేదా..ఎంతమాట పడితే అంత మాట అనేయడమేనా. పెద్దరికానికి ఇచ్చే గౌరవమిదేనా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నంద్యాల ఓటరుపై కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఇదే చంద్రబాబు అనుభవం. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ అదే మాట్లాడారాయన. జగన్మోహన్ రెడ్డి పరుష వ్యాఖ్యలు విన్నంతనే ప్రతిస్పందించి ఉంటే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు? ఇందుకే చంద్రబాబయ్యారు.
దీనికి ఓ ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. 2004 లేదా 2009 ఎన్నికల్లో వైయస్ఆర్ రాజశేఖరరెడ్డి అనుసరించిన వ్యూహమే కాంగ్రెస్కు విజయాలను కట్టబెట్టింది. ఎన్నికల ముందు రోజు రుణాలు చెల్లించద్దంటూ 2004 ఎన్నికల్లో వైయస్ ఇచ్చిన పిలుపు కాంగ్రెస్కు కనీసం 50 స్థానాలలో విజయాన్ని కట్టబెట్టింది. ఒక్క డైలాగ్ చాలు కదా. అదృష్టాన్ని తిప్పేసుకోవడానికి. అలాగే.. 2009 ఎన్నికల్లో సైతం..ఏపీలో ఎన్నికలు ముగిసిన తదుపరి తెలంగాణకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి, లబ్ధి పొందారు వైయస్ఆర్. అనుభవంతో వచ్చిన అధికారం అది. మహాకూటమిని ఎదిరించి గెలుస్తామా అనే సందేహం ఆ ఎన్నికల్లో చివరి క్షణం వరకూ పట్టి పీడిచింది.
ఎన్నికలకు ముందు రోజు చేసే వ్యాఖ్యలు ఓటర్లపై కచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి దివంగత ప్రధాని ఇందిరా గాంధీ సైతం మినహాయింపేమీ కాదు. అక్కడిదాకా ఎందుకు.. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ తిరుపతి సభలో ఏం చెప్పారు? ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారా.. లేదా? అమల్లో పెట్టారా.. లేదే. అంతే.. అనుభవంతో కూడిన మాటలకు విశ్వసనీయత ఉండదని ఆనాటి ఆ ప్రసంగం నిరూపించింది.
చంద్రబాబు నిన్న చేసిన వ్యాఖ్యలు అలాంటవి కావు. ప్రతిపక్ష నేతకు మాట్లాడడం తెలియదు.. పెద్దలను గౌరవించడం అంతకంటే తెలియదని ఆయన ప్రజలకు సందేశం ఇవ్వదలచుకున్నారు. ఇచ్చారు. ఆ వ్యాఖ్యల ప్రభావం రెండు పార్టీల గెలుపోటములను ఎలా ప్రభావితం చేస్తాయో.. తెలియడానికి మరికొద్ది గంటలు ఆగాల్సిందే.
-సుమ