సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. నంద్యాలలో గెలుపు ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందన్న అంచనాలతో రెండు పార్టీలూ శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నాయి. చంద్రబాబు సర్కారు వైఫల్యాలు, భూమా సెంటిమెంట్ పై వైకాపా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. చంద్రబాబు సర్కారు అభివృద్ధి, భూమా సెంటిమెంటే తమను గెలిపిస్తాయన్న ధీమాతో టీడీపీ ఉంది. ఓపక్క ప్రచారం హోరెత్తిస్తూ… మరోపక్క ఓటు మేనేజ్మెంట్ పై టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో టీడీపీకి కొత్త టెన్షన్ పట్టుకుంది. నంద్యాల నియోజక వర్గంలో నకిలీ ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయనీ, వాటితోనే తమకు కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదురౌతున్న చర్చ టీడీపీ వర్గాలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ టెన్షన్ ఏ రేంజికి చేరిందంటే… ఎన్నికల కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది.
నంద్యాల నియోజక వర్గంలో 40 వేల నకిలీ ఓట్లున్నాయనీ, వెంటనే చర్యలు తీసుకోవాలంటూ భన్వర్ లాల్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఓటర్లు జాబితా తెప్పించి, నకిలీలను గుర్తించి, తక్షణం చర్యలకు ఆదేశించాలని వారు కోరారు. అయితే, స్థానికంగా లేకున్నా కూడా ఓటు హక్కు కలిగినవారిని గుర్తించేందుకు తగు చర్యలు తీసుకుంటామని భన్వర్ లాల్ టీడీపీ నేతలతో స్పష్టం చేశారు. ఎన్నిక జరుగుతున్న సమయంలో ఇటువంటి వారు తారసపడితే బూత్ స్థాయి ఏజెంట్లు వెంటనే ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అయితే, ఓటర్లకు ఆధార్ కార్డు నంబర్ తో లింక్ చేస్తే బాగుంటుందనీ, అప్పుడు నకిలీ ఓటర్లకు చెక్ పెట్టినట్టు అవుతుందని టీడీపీ నేతలు సలహా ఇచ్చారట. ఓటర్ల జాబితాకు ఆధార్ లింక్ చేయాలనే అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన స్టే ఉన్న నేపథ్యంలో అలాంటి నిర్ణయాలు తాము తీసుకోలేమని భన్వర్ లాల్ స్పష్టం చేశారు.
నకిలీ ఓట్లు నంద్యాల ఉప ఎన్నికలో సమస్యగా ఉంటుందనేదే టీడీపీ వాదన. అయితే, ఎన్నికల సమయంలో బూతు స్థాయి ఏజెంట్లే గుర్తించి ఫిర్యాదు చెయ్యొచ్చు అని చెప్పడమూ సమస్య అవుతుంది! ఎందుకంటే, ఓటు వెయ్యడానికి వచ్చినవారిని ఏజెంట్లు అడ్డగిస్తే గొడవలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి… ఓటు వెయ్యడానికి వచ్చినవారిని క్షుణ్ణంగా పరిశీలించాకనే లోపలికి పంపుతామని భన్వర్ లాల్ చెబుతున్నారు. అది కూడా ప్రాక్టికల్ గా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే. ఎందుకంటే, పోలింగ్ అధికారులందరూ వేర్వేరు చోట్ల ప్రభుత్వోద్యోగాల్లో ఉన్నవారు వస్తారు. వారు నకిలీ ఓటర్లనీ, స్థానికేతులనీ ఎలా గుర్తించగలగుతారు..? ఇంతకీ టీడీపీ ఆందోళన చెందుతున్నట్టు అన్ని వేల సంఖ్యలో నకిలీ ఓట్లు ఉండే ఛాన్స్ ఉందటారా..?