అనుకున్నట్టుగానే అంగరంగ వైభోగంగా అమాత్య అనుచర సహితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాలలో ఎన్నికల సందడికి శ్రీకారం చుట్టారు. అధికార కార్యక్రమాన్నే రాజకీయ ప్రచార సభగా మార్చేశారు.ఎందుకంటే తమ ప్రచారం చెప్పుకోవడంతో ఆగకుండా ప్రతిపక్ష వైసీపీ పేరెత్తి మరీ విమర్శించారు. వారొచ్చి మాయమాటల చెబుతారని, అభివృద్ధి కావాలంటే తమకు కులం ధనం వంటివి కావాలంటే వారికి మద్దతు ఇవ్వొచ్చని వ్యాఖ్యానించారు. ఈ మాటల్లో రాజకీయ సందేశం సుస్పష్టంగానే కనిపిస్తుంది. అయినా అది పెద్ద వింత గాని కొత్త గాని కాదు. అధికారంలో వున్నవారు ఉప ఎన్నికలను తమకు అనుకూలంగా వుండేలా ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం జరుగుతూనే వుంటుంది. అందులోనూ చంద్రబాబు అధికారంలో వుంటే సర్వశక్తులూ మొహరించడం కద్దు. ఇప్పుడు నంద్యాలకు 12మంది ఇన్ఛార్జిలను నిర్ణయించి 800 కోట్ల రూపాయల పనులను మంజూరు చేసినట్టు ప్రకటించారంటే ఎంత తీవ్రంగా తీసుకున్నారో తెలుస్తుంది. ఇదంతా నిష్కామకర్మగా చేస్తున్నారని ఎవరనుకుంటారు? పైగా ఇంత చేసినా నంద్యాల ఉప ఎన్నిక హౌరాహౌరి పోరాటంగానే వుంటుందని అంటున్నారు. రాయలసీమ వేదిక తరపున తాను పోటీ చేస్తానని బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రకటించారు. ఇక కాంగ్రెస్ కూడా రంగంలో వుంటుందంటున్నారు. తక్కిన పార్టీలు ఇంకా ఒక వైఖరి తీసుకోవలసి వుంది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత చీలిపోవడం కూడా జరగొచ్చు. అయినా రాజకీయంగా సవాలు తీవ్రంగా వుంటుంది గనకే చంద్రబాబు ఇంతగా కేంద్రీకరిస్తున్నారు.