రచయిత, దర్శకుడు నంధ్యాల రవికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నంధ్యాల రవి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కరోనా కి చికిత్స అంటే ఇప్పుడు లక్షల్లో అవుతోంది. అందుకే.. పరిశ్రమలో ఎవరైనా ఆయన్ని ఆదుకోవాలని సన్నిహితులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు సప్తగిరి నంధ్యాల రవికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. నంధ్యాల రవి దర్శకత్వంలో సప్తగిరి ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. ఆ స్నేహంతోనే సప్తగిరి ముందుకొచ్చి, తన దర్శకుడికి తన వంతు సహాయం అందించారు. సీసీసీ ద్వారా కూడా నంధ్యాల రవికి కొంత మొత్తం అందించింది. పరిశ్రమలోని పెద్దలు సహాయం అందిస్తే.. ఆయన ఆరోగ్యం మెరుగవుతుంది.