నంద్యాల ఎంపి ఎస్.పి.వై. రెడ్డి (65) ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. రెండు రోజుల క్రితం బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగిపోవడంతో ఆయనను వెంటనే హైదరాబాద్ లోని ఒక ప్రముఖ కార్పోరేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు చెప్పారు. ఆయన ఉన్నత విద్యావంతుడు. అలాగే బాబా ఆటామిక్ రీసర్చ్ సెంటర్ ముంబైలో సైంటిఫిక్ ఆఫీసర్ వంటి అత్యున్నత హోదాలో పనిచేసిన వ్యక్తి. 1977లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి నీళ్ళ ట్యాంకులు తయారు చేసే పరిశ్రమ పెట్టారు. ఆయన కృషి, పట్టుదల, తెలివితేటలూ కారణంగా అదే నేడు అందరికీ చిరపరిచితమయిన నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గాఎదిగింది. ఆయన ఇదివరకు కాంగ్రెస్, భాజపా, వైకాపాలలో పనిచేసి ప్రస్తుతం తెదేపాలో ఉన్నారు. అయన 2014 ఎన్నికలలో నంద్యాల నుంచి వైకాపా టికెట్ పై లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత కొన్ని నెలలకే ఆయన వైకాపాని వీడి తెదేపాలో చేరారు.