నాని అంటే… ‘పక్కింటి కుర్రాడు’ లెక్క. తన పాత్రలు సరదాగా ఉంటాయి. కథల్లో, నటనలో సహజత్వం కనిపిస్తుంది. అందుకే ‘నేచురల్ స్టార్’ అయ్యాడు. అయితే ఈ ట్యాగ్ లైన్ నానికి మరీ బోర్ కొట్టేసిందేమో, ఇప్పుడు రూటు మారుస్తున్నాడు. మెల్లమెల్లగా డోసు పెంచుతున్నాడు. మొన్నొచ్చిన ‘హిట్ 3’ టీజర్లో నానిని, తన క్యారెక్టరైజేషన్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈరోజు విడుదలైన ‘పారడైజ్’ మరో రకం. టీజరూ, అందులో డైలాగులూ, నాని లుక్… వేరే లెవల్ అంతే! అసలు నానిని ఈ ఇలా చూస్తామని ఓ నాలుగేళ్ల క్రితం ఎవరూ ఊహించి ఉండరు.
నిజానికి ఈ మార్పు ఇప్పుడు మొదలైంది కాదు. ‘వి’ నుంచే నాని తనలోని కొత్త నటుడ్ని ఆవిష్కరించుకొనే ప్రయత్నం మొదలెట్టాడు. అందులో తనది పూర్తిగా నెగిటీవ్ క్యారెక్టర్. బాగా చేశాడు కూడా. కానీ వర్కవుట్ అవ్వలేదు. ఆ తరవాత టక్ జగదీష్లో కూడా కొత్త తరహాగా ట్రై చేశాడు. ఎప్పుడూ జోవియల్ గా ఉండే పాత్రలు చేసే నాని… కొంత సీరియస్ నెస్ చూపించాడు. దురదృష్టం కొద్దీ అదీ వర్కవుట్ కాలేదు.
‘దసరా’లో లుక్ చూసి ‘ఇది నాని సినిమానేనా’ అనుకొన్నారు. అంత ‘రానెస్’ ఎప్పుడూ చూడకపోవడంతో నాని కొత్తగా కనిపించాడు. తన కష్టం ఈసారి ఫలించింది. ప్రేక్షకులు నానికి ఇది వరకు ఇవ్వనంత పెద్ద హిట్ ఇచ్చారు. ఆ నమ్మకంతో నాని ఇప్పుడు దూకుడు పెంచేశాడు. ‘హిట్ 3’, ‘ప్యారడైజ్’ చిత్రాలు ఇందుకు నిదర్శనం. ఇది వరకైతే నానిని ఇలాంటి కథల్లో, ఇలాంటి పాత్రల్లో చూడడానికి ప్రేక్షకులు ఇబ్బంది పడేవాళ్లేమో. కానీ మెల్లమెల్లగా నానిలోని మార్పు గమనిస్తుండడంతో వాళ్లూ నాని ప్రయత్నాల్ని అర్థం చేసుకొంటున్నారు.
నటుడన్నవాడు ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేయకూడదు. ఒకే ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకూడదు. నాని ఇది అక్షరాలా పాటిస్తున్నాడు. నాని తనని తాను మరింత ఎక్స్ఫ్లోర్ చేసుకోవడంతో దర్శకుల పని కూడా సులభం అవుతుంది. ‘ఈ కథకు నాటి సూట్ కాడేమో’ అనే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు అవసరం లేదు. కథలో దమ్ముండాలి కానీ.. ఎలాంటి పాత్ర చేయడానికైనా నాని రెడీనే.
కాకపోతే అప్పుడప్పుడూ తన మార్క్ పాత్రల్ని కథల్ని నాని చేస్తూనే ఉండాలి. నాని నేచురల్ స్టార్ కంటే ముందు ఫ్యామిలీ స్టార్. కుటుంబ ప్రేక్షకులకు తన సినిమాలు ఇష్టం. వాళ్లకు నచ్చే కథల్ని కూడా కేటరేట్ చేస్తుండాలి. తనకంటూ ఓ గుర్తింపు ఇచ్చిన జోనర్ని మర్చిపోకూడదు. ఈ రెండింటినీ నాని బాలెన్స్ చేసుకోగలిగితే.. మరింత బాగుంటుంది.