నాని, సమంత జంటగా నటించిన తొలి సినిమా ‘ఈగ’. అందులో నాని కనిపించేది కాసేపే. మహా అయితే ఓ పదిహేను నిమిషాలు! అయితే… ‘ఈగ’ తరవాత వచ్చిన ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’లో ఆ లోటు తీర్చేశాడు. అందులో ఇద్దరూ మూడు గెటప్పుల్లో కనిపించారు. ఆ సినిమా వచ్చి ఆరేళ్లు అవుతోంది. తరవాత నాని, సమంత మరోసారి జంటగా కనిపించలేదు. ముచ్చటగా మూడోసారి వీళ్ళిద్దరూ జంటగా నటించనున్నారని సమాచారం. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన సినిమా ’96’. ఆ సినిమా రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్రాజు కొన్నారు. తెలుగులో నాని, సమంత జంటగా ’96’ని రీమేక్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ఇది. త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని టాక్. గురువారం ‘దేవదాస్’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు నాని. నాగార్జున మరో హీరోగా నటించిన ఆ సినిమాలో నాని నటనకు మంచి పేరొచ్చింది. ‘యూ టర్న్’తో సమంత నటనకూ మంచి పేరొచ్చింది.