తెలుగులో అడపా దడపా బయోపిక్‌లు వస్తూనే ఉన్నాయి. ‘మహానటి’ ఓ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ‘మల్లేశం’ అందరి హృదయాల్నీ దోచుకొంది. మధ్యలో కొన్ని బయోపిక్‌లు బెడిసికొట్టాయి. ఇప్పుడు మరో బయోపిక్ తయారు కాబోతోంది. ఇది కాస్త ఇంట్రస్టింగ్ స్టోరీనే. అదే.. బాపు – రమణల కథ.
తెలుగునాట దర్శకుడిగా బాపు తనదైన ముద్ర వేశారు. రచయితగా ముళ్లపూడి వారి శైలి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అన్నింటికంటే ముఖ్యంగా వీరిద్దరి స్నేహం అజరామరం. చిత్రసీమలో స్నేహమంటే బాపు – రమణలే గుర్తొస్తారు. వీరిద్దరి కథ ని వెండి తెరపైకి తీసుకురావాలని ఓ అగ్ర రచయిత ప్రయత్నిస్తున్నారు. ఆయనే బుర్రా సాయిమాధవ్.
టాలీవుడ్ లో స్టార్ రచయితగా బుర్రాకు మంచి పేరుంది. పెద్ద పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్స్ ఆయన. మహానటికి సంభాషణలు అందించారు. ఇప్పుడు ఆయన దృష్టి బాపు – రమణల బయోపిక్‌పై పడింది. వీరిద్దరి బయోపిక్ తీస్తే చూడాలని వుందని తెలుగు 360 ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు బుర్రా.
మరి బాపు – రమణలుగా ఎవరు బాగుంటారు? దీనిపై కూడా ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. నాని బాపు పాత్రలో నటిస్తే, శర్వా రమణగా బాగుంటారని…బుర్రా చెప్పుకొచ్చారు. ఐడియా బాగానే వుంది. నాని – శర్వా కలిస్తే అదో మ్యాజిక్. వారిద్దరూ బాపు, రమణల కథ చేస్తే అద్భుతంగా సెట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలిస్తే.. బాపు, రమణల అభిమానుల కనుల పంటే.