‘‘ఈ సినిమాలో నేనూ ఓ చిన్న భాగమే. అదేంటి? ఎలా? అనేది ప్రేక్షకులు సినిమా చూస్తే తెలుస్తుంది’’ అని స్టేజి మీద మైక్ పట్టుకున్న వెంటనే నాని ప్రకటించేశాడు. తర్వాత అతనికి చిన్న సందేహం వచ్చింది. ఎడిటింగ్‌లో తను చేసిన సన్నివేశాలు వుంచారా? తీసేశారా? అని! ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెనక్కి తిరిగి ‘‘అది ఉందా? ఎడిటింగ్‌లో పోయిందా?’’ అని అడిగాడు. దర్శకుడు వుందని తల ఊపడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటించిన ‘నీవెవరో’ ఆడియోలో ఈ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ‘నిన్ను కోరి’ సినిమా తరవాత కోన వెంకట్ నిర్మించిన సినిమా ‘నీవెవరో’. హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ, హీరోయిన్ నివేథా థామస్ మినహా ‘నిన్ను కోరి’కి పనిచేసిన టీమ్ అంతా ‘నీవెవరో’కి పని చేశారు. యూనిట్‌తో వున్న స్నేహ సంబంధాల కారణంగా నాని చిన్న సహాయం చేశారు. అదేంటి… వాయిస్ ఓవరా? అతిథి పాత్రా? ఇంకొకటా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాలి. తాప్సీ, రితికా సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.