నాని నిర్మాతగా ‘ఆ!’ అనే సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదేం ఆషామాషీ సబ్జెక్ట్కాదు. తెలుగు తెరపై ఓ కొత్త ప్రయోగంగా ఉండబోతోందని సమాచారం. ప్రశాంత్ వర్మ ఇది వరకుకొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. ఆ అనుభవంతో.. ఓ విచిత్రమైన కథ రాసుకున్నాడు. ఈ సినిమాలో ఆరేడు ప్రధానమైన పాత్రలుంటాయి. ఆరు పాత్రలూ ఒక దానితో మరోకటి సంబంధం లేనివే. ఒక్కో పాత్రదీ ఒక్కో కథ. ఒక్కో కథ… ఒక్కో జోనర్లో ఉంటుంది. ప్రతీ పావు గంటకీ ఓ కొత్త జోనర్ ప్రవేశిస్తుంది. అంటే… ఒక సినిమాలో యాక్షన్, కామెడీ, హారర్, రొమాన్స్, ఫాంటసీ, థ్రిల్లర్ ఇలా అన్ని కథల్నీ చూడొచ్చన్నమాట. ఈ కథలన్నీ దేనికి లింక్ అయ్యాయన్న విషయం షాకింగ్‌గా ఉండబోతోందని సమాచారం. బాలీవుడ్లో ఇలా ‘గొలుసు’ కథల కాన్సెప్టులో సినిమాలొచ్చాయి. టాలీవుడ్లో మాత్రం ఇదే తొలిసారి. మరి ఈ ప్రయోగం ఏ మేరకు సఫలం అవుతుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో నాని, రవితేజలు వాయిస్ ఓవర్ ఇచ్చారు. నాని ఓ చెట్టు పాత్రకు గొంతు ఇస్తే.. రవితేజ చేపకు మాటలు నేర్పారు. ఈ సినిమాలో మరిన్ని చిత్ర విచిత్రాలున్నాయి. అవన్నీ ఒకొక్కటీ బయటపెట్టడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.