ఎవరు చెప్పారు…? గాడ్ ఫాదర్ లేకుండా చిత్రసీమలో ఎదగలేరని..?
ఎవరు చెప్పారు..? బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్లు కాలేరని…?
అలా ఎవరైనా అంటే….నానిని చూపించండి. ఇంతింతై.. వటుడంతై… అన్నట్టు సాగిన నాని ప్రయాణాన్ని కథగా చెప్పండి.
ఇక్కడ స్వయం కృషి చేస్తే చిరంజీవి పుడతాడని..
తన కాళ్లపై తాను నిలబడి… ప్రయాణం సాగిస్తే.. ఓ నాని ఉద్భవిస్తాడని అర్థమవుతుంది.
నాని.. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాడో..?
ఓ రేడియో జాకీ నుంచి తన ప్రయాణం మొదలైంది. సహాయ దర్శకుడిగా మారాడు. నాని అదే క్లాప్ బోర్టు పట్టుకుంటే – డైరెక్టర్ గా సెటిలవుదుడేమో…? మంచి పేరు కూడా తెచ్చుకుందుడేమో..? కానీ ఓ నాచురల్ స్టార్ ని చూసే అవకాశం మాత్రం తెలుగు ప్రేక్షకులు కోల్పోయేవారు.
ఎంటీఅబ్బాయి.. నటిస్తున్నాడా? కెమెరా ముందు ప్రవర్తిస్తున్నాడా? లేదంటే… తన జీవితాన్నే సినిమాగా తీసేస్తున్నారా? అన్నంత సహజంగా పాత్రలో ఒదిగిపోతుంటాడు. అదే.. తెలుగు ప్రేక్షకులకు నచ్చేసింది. తన నటన, నవ్వు, కామెడీ టైమింగ్, డాన్సులు, ఫైటింగులు.. అన్నింట్లోనూ సహజత్వమే. కాబట్టే నాచురల్ స్టార్ అయిపోయాడు.
నాని ప్రస్థానం.. యాధృచ్చికం కాదు. అదృష్టం అంతకంటే కాదు. అది.. తన కష్ట ఫలం. నాని కథల ఎంపిక చూడండి. ఎక్కడా తూకం తగ్గదు. తనకు నప్పని పాత్ర నాని ఎప్పుడూ చేయలేదు. సన్నివేశంలో బలం లేకపోయినా.. కేవలం తన టైమింగ్ తో.. ఆ సన్నివేశాన్ని పేలేలా చేసే అతి కొద్ది మంది నటుల్లో నాని ఒకడు. నాని సినిమా ఫ్లాప్ అయినా.. నాని కోసమైతే ఒక్కసారి చూసేయొచ్చన్న భరోసా కలిగింది.
మినిమం గ్యారెంటీ హీరోగా నిర్మాతలకు నమ్మకం కలిగించాడు నాని. తన ప్రాజెక్ట్ అంటే సినిమా విడుదలకు ముందే.. నిర్మాత సేఫ్ జోన్ లో ఉండిపోతాడు. అందుకే యువ హీరోల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్నవాడిగా ఎదిగాడు.
నాని నిర్మాత కూడా. తన అభిరుచేంటో `అ`తో అర్థమైంది. `హిట్`తో మరో హిట్టు కొట్టాడు. ఈ సినిమాలతో నాని నిర్మాతగా ఎంత సంపాదించాడో తెలీదు గానీ.. ఇద్దరు మంచి దర్శకుల్ని మాత్రం పరిశ్రమకు అందించాడు.
నాని ఎదుగుదల నానిది మాత్రమే కాదు. పరిశ్రమది కూడా. నానిని చూసి `నానిలా అవుతానేమో` అనే ధైర్యంతో పరిశ్రమకు వచ్చేవాళ్లెంతోమంది. ఓ తరానికి.. ఓ వర్గానికి నాని ఓ స్ఫూర్తి. ఈ స్ఫూర్తి ఇలానే కొనసాగాలని… నాని మరెన్నో విజయాల్ని అందుకోవాలని కోరుకుంటూ..
హ్యాపీ బర్త్ డే టూ నాచురల్ స్టార్!!!!