తన సినిమాని మార్కెట్ చేసుకోవడం ఎలాగో నానికి బాగా తెలుసు. `కోర్ట్` సినిమా అందుకు పెద్ద ఉదాహరణ. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకొంది. కంటెంట్ లో బలం ఉండడం ఒక కారణమైతే, నాని ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్లిన విధానం మరో కారణం. ‘ఈ సినిమా నచ్చకపోతే నా రాబోయే హిట్ 3 చూడొద్దు’ అని చెప్పి, అందర్నీ తన వైపు తిప్పుకొన్నాడు. ఈ స్టేట్ మెంట్ బాగా వర్కవుట్ అయ్యింది. మే 1న రాబోతున్న `హిట్ 3`కి కూడా తానే నిర్మాత. ఈ సినిమా ప్రమోషన్ని కూడా తనదైన స్టైల్ లో మొదలు పెట్టేశాడు నాని. ‘ఈ సినిమాకు ఆడాళ్లూ, పిల్లలూ దూరంగా ఉండండి. మా అబ్బాయికి కూడా ఈ సినిమా చూపించను’ అనేశాడు. నిజంగా ఇది బోల్డ్ స్టేట్మెంటే. పిల్లలు, ఆడాళ్లూ చూడలేనంత వైలెన్స్ తన సినిమాలో ఉందని స్ట్రయిట్ గానే చెప్పేశాడు నాని. తన సినిమాలు పిల్లలకు బాగా నచ్చుతాయి. లేడీ ఫాలోయింగ్ నానికి బలం. వాళ్లిద్దర్నీ నాని ఈ స్టేట్మెంట్ తో దూరం చేసుకొన్నాడు.
కాకపోతే ఇక్కడ నాని దగ్గర ఓ లాజిక్ వుంది. ‘హిట్ 3’ ఎవరి కోసం తీశాడో నానికి బాగా తెలుసు. యాక్షన్ ఇష్టపడేవాళ్ల కోసమే తాను ఈ సినిమాని క్యాటర్ చేస్తున్నానని నాని గ్రహించాడు. అదే ఫాలో అవుతున్నాడు. ‘యానిమల్’, ‘మార్కో’ సినిమాలేమైనా పిల్లలు చూశారా? ఆ సినిమాలు ఎవరికి నచ్చాలో వాళ్లకు నచ్చాయి. సూపర్ హిట్ అయ్యాయి. ‘హిట్ 3’ కోసం నాని ఫాలో అవుతున్న ఫార్ములా కూడా ఇదే కావొచ్చు. ఈ రకంగా ఆలోచిస్తే నాని లాజిక్ కరెక్టే. ఇప్పటి యూత్ ఆలోచనలు మారిపోయాయి. వాళ్లకు ఏదైనా సరే.. హై డోస్ లో ఇవ్వాల్సిందే. అలాంటి సినిమాలు నచ్చుతున్నాయి కూడా. అందుకే నాని ఇప్పుడు వాళ్లకే గాలం వేయబోతున్నాడు. నాని ఇంత యాక్షన్ చేస్తే జనం చూస్తారా? అనే అనుమానాలూ అక్కర్లెద్దు. ఎందుకంటే ఇది వరకే ‘దసరా’ సినిమాలో నాని తన ఇమేజ్ మార్చుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడ సక్సెస్ అయ్యాడు. కాబట్టి నాని వెండి తెరపై గొడ్డలి పట్టుకొని రప.. రప.. నరుకుతున్నా, చూడ్డానికి నమ్మశక్యంగానే ఉందిప్పుడు.