హీరో నాని దగ్గర ఓ మంచి అలవాటు ఉంది. తన దర్శకుల చేయి, తానెప్పుడూ విడిచి పెట్టడు. తన సినిమాతో డెబ్యూ ఇచ్చిన డైరెక్టర్లందరినీ ఓ కాపు కాచుకొని చూస్తుంటాడు. ఇప్పుడు శైలేష్ కొలను విషయంలో అదే జరుగుతోంది. ‘హిట్’ సినిమాతో శైలేష్‌ను పరిచయం చేశాడు నాని. ఆ సినిమా హిట్టయ్యింది. ఆ వెంటనే హిట్ ఫ్రాంచైజీలో ‘హిట్ 2’ వచ్చింది. అదీ హిట్టే. కాకపోతే.. ఆ తరవాత ‘సైంధవ్’ తీశాడు శైలేష్. సంక్రాంతికి విడుదలైన వెంకటేష్ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అంతటి డిజాస్టర్ తరవాత శైలేష్‌కు మరో అవకాశం దక్కడం కష్టమే. వస్తే, గిస్తే ఓ చిన్న సినిమా వస్తుంది. ఆ సినిమాతో మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సిందే. కానీ ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నాని మళ్లీ చేయి అందించాడు. ‘హిట్ 3’తో ఛాన్స్ ఇచ్చాడు.
‘హిట్ 2’ తరవాత హిట్ 3నే రావాలి. నానితో ఈ సినిమా ఉంటుందని ప్రకటించారు కూడా. కానీ.. నాని మిగిలిన సినిమాలతో బిజీ అయిపోవడం, శైలేష్ కు వెంకటేష్ దొరడంతో ‘హిట్ 3’ ఆగింది. సైంధవ్ తరవాత హిట్ 3పై అందరికీ అనుమానాలే. సైంధవ్ రిజల్ట్ చూసిన తరవాత కూడా నాని అవకాశం ఇస్తాడా? అని నొసలు చిట్లించారు. కానీ నాని మాత్రం ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. ‘సైంధవ్’ రిజల్ట్ తో పని లేకుండా తన దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చాడు. హిట్ ఫ్రాంచైజీ కావడం, నాని నిర్మాతగా, హీరోగా డ్యూయల్ రోల్ చేయడంతో హిట్ 3 పై తప్పకుండా అంచనాలు ఏర్పడతాయి. మరీ డిజాస్టర్ అయితే కాదు. నిర్మాతగా నాని సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే తక్కువ రిస్క్‌తో నాని ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు.
నాని హీరోగా ‘సరిపోదా శనివారం’ తుది దశకు చేరుకొంది. ఆ తరవాత ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయాలి. దాంతో పాటు `హిట్ 3`ని కూడా సమాంతరంగా పట్టాలెక్కిస్తాడని టాక్.