ఒకపక్క సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరోపక్క తన బ్యానర్ లో సినిమాల్ని నిర్మించే పనిని చాలా సీరియస్ గా తీసుకున్నారు నాని. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ నానిదే. ఇప్పుడు యునానిమస్ అనే మరో బ్యానర్ ని యాక్టివ్ చేశారు.
వాల్ పోస్టర్ సినిమాలో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలన్నీ నిర్మించాలని నాని ప్లాన్. రీసెంట్ గా కోర్ట్ వాల్ పోస్టర్ సినిమాలోనే వచ్చింది. యునానిమస్ బ్యానర్ లో కొంచెం హై బడ్జెట్ సినిమాలు నిర్మించాలనేది నాని ఉద్దేశం. ఈ యునానిమస్ బ్యానర్ లోనే హిట్ ఫ్రాంచైజ్ రూపొందిస్తున్నారు. అలాగే చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా ఈ బ్యానర్ లోనే ఉంటుంది.
ప్రస్తుతం హిట్3 పనుల్లో ఉన్నారు నాని. దాదాపుగా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మే 1న సినిమా విడుదల. ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమాలో హీరో కార్తీ ఒక కామియో రోల్ లో కనిపిస్తారని టాక్. ఆయనతోనే హిట్ 4 ని ప్లాన్ తీస్తారని సమాచారం.
‘హిట్’ ఫ్రాంచైజ్ లో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. విశ్వక్సేన్, అడివి శేష్.. తొలి రెండు సినిమాల్లో నటించారు. మూడో పార్ట్ నాని చేస్తున్నారు. ఇప్పుడు హిట్ ఫ్రాంచైజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలంటే మరో స్టార్ ఎట్రాక్షన్ అవసరం. దీనికోసం తెలుగు తమిళ్ రెండు భాషల్లో క్రేజ్ ఉన్న కార్తీ ని తీసుకురావడం నిజంగా చాలా మంచి ఆలోచన. నిర్మాతగా నాని ఈ విషయంలో చాలా తెలివిగా ఆలోచించారనే చెప్పాలి.
హిట్ 4 గనుక కార్తీతో చేస్తే ఈ ఫ్రాంచైజీని అటు తమిళ్ ఇండస్ట్రీ కూడా పరిచయం చేసినట్లుగా ఉంటుంది. కార్తి అంటే ఆటోమేటిక్ గా తెలుగులో కూడా క్రేజ్ వుంటుంది. కార్తీ కూడా ఊపిరి తర్వాత నేరుగా ఒక తెలుగు సినిమా చేయాలని ఎప్పటినుంచో వుంది. ఇప్పుడు హిట్ 4 రూపంలో ఆ అవకాశం వచ్చిందని చెప్పాలి.