ప్రేమికులకు ఎన్నో అంతరాలు. ముఖ్యంగా కులం, ఆస్తులు అంతస్థులు ప్రేమికుల్ని విడగొడుతుంటాయి. తరాలు మారినా ఈ తరహా కథలకు లోటు లేదు. ఇప్పటికీ ‘రాజు పేద’, కోటలో రాణి, తోటలో రాజు లాంటి కథలు వస్తూనే ఉన్నాయి. జనాలు చూస్తూనే ఉన్నారు. ‘దసరా’ కూడా ఈ టైపు కథేనట. నాని హీరోగా రూపొందుతున్న చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓడెల దర్శకుడు. ఈ సుకుమార్ శిష్యుడిపై నాని బాగా నమ్మకం పెంచుకొన్నాడు. అందుకే కొత్త దర్శకుడైనా, బడ్జెట్ విషయంలో లోటు చేయడం లేదు. సుకుమార్ లవ్ స్టోరీలు చెప్పడంలో స్పెషలిస్టు. వాళ్ల శిష్యులకూ అదే అలవాటైంది. బుచ్చిబాబు `ఉప్పెన`తో ఓ మంచి లవ్ స్టోరీ చెప్పాడు. ఇప్పుడు శ్రీకాంత్ కూడా.. ‘దసరా’లో మంచి లవ్ స్టోరీ రాసుకొన్నాడట. ఇది రెగ్యులర్ సినిమాల్లో కనిపించే రాజు – పేద టైపు లవ్ స్టోరీనే అట. హీరో స్లమ్ లో ఉంటాడు. హీరోయిన్… రాజుగారి కోట లాంటి ఇంట్లో ఉంటుంది. వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అనే దాన్ని దర్శకుడు చాలా ఆసక్తికరంగా మలిచాడని టాక్. ప్రచార చిత్రాల్లో.. మాస్,యాక్షన్ చూసి, ఇది పూర్తి స్థాయి మాస్ సినిమా అనుకొంటున్నారంతా. కానీ ఇందులో లవ్ స్టోరీ చాలా గమ్మత్తుగా ఉంటుందని, ఈ సినిమాకి అదే ప్లస్ పాయింట్ అవుతుందని అంటున్నారు.