టాలీవుడ్లో మినిమం గ్యారెంటీ ఉన్న హీరోల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు నాని. వరుసగా ఆరు హిట్లతో ఎవ్వరికీ దక్కని ఘనత అందుకున్నాడు. కథలు, దర్శకుల ఎంపికలో నాని చూపిస్తున్న వైవిధ్యమే అతని విజయాలకు కారణం. సినిమా సినిమాకీ అతని మార్కెట్ రేంజ్ పెరుగుతోంది. అందరికీ అందుబాటులో ఉండే హీరోగా నాని మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే వరుస విజయాల్ని చవి చూసిన ఆనందమో, ఆ విజయాలు అందించిన ధైర్యమో తెలీదు గానీ.. ఇప్పుడు నాని తన రెమ్యునరేషన్‌ని అమాంతంగా డబుల్ చేసేశాడు. ఎంసీఏ కి నాని దాదాపుగా రూ.5 కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు మైత్రీ మూవీస్‌తో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు నాని. అయితే ఈ సినిమాకి గానూ ఏకంగా రూ.9 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడట. నాని పారితోషికం పెంచడం ఖాయమని మైత్రీకీ తెలుసు. రూ.5 తీసుకుంటున్నవాడు కాస్తా.. 7 వరకూ వెళ్లి ఆగుతాడని అనుకున్నారు. కానీ ఏకంగా రూ.9 కోట్లు చెబుతుండడంతో మైత్రీ మూవీస్ మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇప్పుడు నానితో ఆ సంస్థ బేరసారాలకు దిగినట్టు సమాచారం.
చిన్న చిన్న సినిమాలతో హీరోగా ఎదిగాడు నాని. ఒక్కో మెట్లూ ఎదుగుతూ తనకంటూ ఓ మార్కెట్ సృష్టించుకున్నాడు. నానితో సినిమా అంటే రూపాయికి రూపాయి రావడం గ్యారెంటీ అన్న భరోసా వచ్చింది. చిన్న సినిమాలతో ఎదిగిన నాని… చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉండాలి అనుకోవడం తప్పు కాదు. మరోవైపు తాను కూడా ఎదగాలనుకోవడం అన్యాయమేం కాదు. కాకపోతే మరీ ఈరేంజులో పారితోషికం పెంచేయడం మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నానిపై పెట్టుబడి ఎందుకు పెడుతున్నారు? సినిమా కాస్త అటూ ఇటూ అయినా, కనీసం పెట్టుబడి అయినా తిరిగి వస్తుందన్న నమ్మకంతో. ఇప్పుడు నానికే రూ.9 కోట్లు ఇస్తే సినిమాకి ఇంకెంత అవుతుంది? ఇలా పారితోషికాలు పెంచుకుంటూ పోతే నిర్మాత బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. అప్పుడు నాని సినిమా యావరేజ్ అయినా లాభం ఉండదు. నిర్మాత అడ్డంగా మునిగిపోవాల్సిందే. మైత్రీ లాంటి సంస్థలకు రూ.9 కోట్లు ఇవ్వడం పెద్ద మేటరేం కాకపోవొచ్చు. కానీ… మధ్య తరగతి నిర్మాత మాత్రం నాని పేరు చెబితే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. యేడాదికి మూడు నాలుగు సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయే నాని కెరీర్‌కి స్పీడు బ్రేకర్లు పడే ప్రమాదం కూడా ఉంది.