నాని అనగానే ఓ ఇమేజ్ కళ్లముందు కదలాడేది. ఫ్యామిలీ ఎమోషన్, ఫన్, లవ్ స్టోరీలూ మెదిలేవి. అయితే క్రమంగా ఆ ఇమేజ్‌ని సైతం పక్కన పెడుతూ కొత్త తరహా పాత్రలు ఎంచుకొంటున్నాడు నాని. ‘వి’లో తన విలనిజం చూపించాడు. ‘దసరా’లో తనలో `రా`నెస్ ప్రదర్శించాడు. ఇప్పుడు రక్తం ఏరులై పారే ఓ సినిమా చేశాడు. అదే ‘హిట్ 3’. శైలేష్ కొలను దర్శకుడిగా ‘హిట్’, ‘హిట్ 2’ చిత్రాలు నాని బ్యానర్లోనే వచ్చాయి. ఇప్పుడు ‘హిట్ 3’. ఈసారి స్వయంగా నానినే హీరోగా కనిపించబోతున్నాడు. అర్జున్ సర్కార్ పాత్రలో. నాని గత చిత్రాలతో పోలిస్తే.. ఇందులో క్యారెక్టరైజేషన్ హీరోయిజం భిన్నంగా కనిపిస్తున్నాయి. సీరియల్ మర్డర్స్, వాటి చుట్టూ నడిచే ఇన్వెస్టిగేషన్.. ఈ సినిమా కథ. సాధారణంగా ఇలాంటి థ్రిల్లర్స్‌లో విలన్లు సైకోలుగా కనిపిస్తుంటారు. ఇందులో మాత్రం అర్జున్ సర్కార్‌నే ఓ సైకోలా ప్రజెంట్ చేశారు. ఈ టీజర్ చూస్తే కచ్చితంగా యానిమల్, కిల్, మార్కో లాంటి సినిమాలు, అందులోని ధారాళంగా కురిసిన రక్తం గుర్తుకురాక మానదు. నిజంగా నానికి ఇది కొత్త తరహా ప్రయత్నమే. కథలోని సీరియస్‌నెస్ టీజర్లో అర్థమవుతోంది. ఇప్పటి యువతరం త్వరగా కనెక్ట్ అయిపోయే జోనర్ ఇది. రక్తపాతం, హింస ఎంత ఉంటే.. అంత కిక్ దొరుకుతోంది. నాని కూడా అదే దారిలో వెళ్లి హిట్ అందుకొంటాడా, లేదా? చూడాలి. మే 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. హిట్ 4 కూడా ఉంటుందని, అందులో ఓ బడా స్టార్ నటిస్తాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ‘హిట్ 3’ క్లైమాక్స్ లో… ఆ సంగతి రివీల్ చేసే అవకాశం ఉంది.