నాని ఇంటర్వ్యూ : సినిమాలన్నీ హిట్టయితేనే మనకు అడ్వాంటేజ్
హిట్ మీద హిట్ కొడుతున్న నేచురల్ స్టార్ నాని ఈ గురువారం ‘కృష్ణార్జున యుద్ధం’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ మీర్ హీరోయిన్లు. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు నానితో జరిపిన ఇంటర్వ్యూ…
ఏవండోయ్ నాని గారూ… ఎలా వున్నారు?
సంతోషంగానూ… కాస్త టెన్షన్‌గానూ… మిక్స్డ్ ఫీలింగ్. ఆల్రెడీ సినిమా చూశా. టీమ్ అందరూ కాన్ఫిడెంట్‌గా వున్నారు. కాని ఎక్కడో మూలాన చిన్న టెన్షన్ వుంటుందిగా.
మీ సినిమా లాస్ట్ వీక్ థియేటర్లలో నుంచి వెళ్లినట్టుంది!
నవ్వేస్తూ… మరీ రెగ్యులర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. మూడేళ్ళ నుంచి ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్నాను. మూణ్ణాలుగు నెలలకు ఓసారి అందరి ముందుకు వచ్చేవాణ్ణి. ఈసారి ‘అ!’తో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చా. అది నా సినిమాగా ప్రాజెక్ట్ అయ్యింది. సినిమా స్టార్ట్ చేసినప్పుడు డబ్బులు పెట్టి, కొంచెం చూసుకుంటే చాలనుకున్నాను. కానీ, ఎక్కువమంది ఆర్టిస్టులు కావడంతో నేనే దగ్గరుండి పబ్లిసిటీ పనులు చూశా. ఇదిగో… ఇప్పుడు ‘కృష్ణార్జున యుద్ధం’తో వస్తున్నా.
ఇంతకీ కృష్ణార్జునులు కథేంటి?
కృష్ణగాడు చిత్తూరులో పెరిగినోడు. రాక్‌స్టార్ అర్జున్ ప్రాగ్లో వుంటాడు. ఇద్దరూ ఎలా కలిశారు? ఎవరిపై యుద్ధం చేశారు? అనేది సినిమా కథ. మధ్యలో ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధాలు కూడా జరుగుతాయి.
‘హలో బ్రదర్’ టైప్ కథా?
కాదండీ. మన సినిమాల్లో డ్యూయల్ రోల్స్ అంటే కవలలుగానో, అన్నదమ్ములుగానో, తండ్రీ కొడుకలుగానో చూపిస్తారు. మా సినిమాలో ఇద్దరికీ ఎలాంటి సంబంధం లేదు. జస్ట్.. సేమ్ పోలికలతో వుంటారంతే. అలాగే డ్యూయల్ రోల్స్‌ని రెండు మూడు ఫ్రేముల్లో చూపిస్తారు. ఇందులో సెకండ్ హాఫ్ అంతా ఇద్దరూ ఒకే ఫ్రేమ్ కనిపిస్తారు.
కృష్ణ, అర్జున్… ఇద్దరిలో మీకు ఎవరు నచ్చారు?
ఇద్దరూ నచ్చారు. అయితే… కృష్ణగాడు కొంచెం ఎక్కువ నచ్చాడు. నాకు తెలిసి ప్రేక్షకుల్లోనూ కృష్ణగాడు ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు. అర్జున్ టైపు మనలో ఎవరూ వుండరు. కృష్ణగాడిలా చాలామంది వుంటారు. అందువల్ల, ఎక్కువమంది వాడితో రిలేట్ అవుతారు.
గాంధీ ఎలా చేశాడు? డైరెక్షన్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారని, రీషూట్స్ చేయించారని..
గాంధీలో నాకు నచ్చేదేంటంటే… క్లారిటీ వున్న దర్శకుడు. పేపర్ మీద ఏం రాసుకుంటాడో… అదే తీస్తాడు. తీయడానికి ముందే ‘అన్నా.. ఎలా వుంది?’ అని అడుగుతాడు. నాకు అభిప్రాయాలు చెప్తా. రీ రికార్డింగ్ చేయిస్తూ… ‘ఒక్కసారి ఈ బిట్ విని ఎలా వుందో చెప్పండి’ అంటాడు. అటువంటప్పుడు మన బాధ్యత పెరుగుతుంది. నేను ఎప్పుడూ డైరెక్షన్లో మీరు ఇన్వాల్వ్మెంట్ కాలేదు. రీషూట్స్ అసలు చేయలేదు.
ప్రతిసారి అన్ సీజన్లో వచ్చే మీరు… ఈసారి సీజన్లో సమ్మర్ హాలిడేస్ మధ్య వస్తున్నారు!
అవును! ఇంతకు ముందు నాకు అన్ సీజన్లో రిలీజ్ డేట్ దొరికేది. కంటిన్యూస్ హిట్స్ వున్నాయనేమో… సీజన్లో రిలీజ్ డేట్ దొరికింది. ఎలా వుంటుందో చూడాలి.
‘రంగస్థలం’ బాగా ఆడుతోంది. మీ సినిమా వచ్చిన వారానికి ‘భరత్ అనే నేను’ వస్తుంది. రెండు పెద్ద సినిమాల మధ్య వస్తున్నానని టెన్షన్ పడుతున్నారా?
సినిమా ఇండస్ట్రీలో కొంతమంది అప్పుడప్పుడూ “సరైన సినిమా వచ్చి రెండు నెలలు అయ్యింది. ఇప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది. బాగా ఆడుతుంది” అంటారు. రెండు నెలల నుంచి ప్రేక్షకులు ఎవరూ సినిమాలకు రావడం లేదంటే మన సినిమాకు ఎందుకు వస్తారు. నెక్స్ట్… ‘లాస్ట్ వీక్ సినిమా సరిగా ఆడలేదు. నెక్స్ట్ వీక్ సినిమాకి అడ్వాంటేజ్ అవుతుంది’ అంటుంటారు. నేను అవన్నీ నమ్మను. లాస్ట్ వీక్ సినిమా హిట్ అయితే… ప్రతి వారం వచ్చే సినిమా హిట్ అయితే…
ప్రేక్షకుల్లో మంచి సినిమాలు వస్తున్నాయని నమ్మకం ఏర్పడుతుంది. అది మనకే అడ్వాంటేజ్. ‘బాహుబలి’ వల్ల తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది కదా! ఎప్పటి నుంచో థియేటర్లకు రాని ప్రేక్షకులను ఆ సినిమా రప్పించింది. సినిమాలు అలా ఆడాలని నేను కోరుకుంటా. ‘రంగస్థలం’ చూశా. బాగా ఆడుతున్నందుకు హ్యాపీ. ‘భరత్ అనే నేను’ ట్రయిలర్ నచ్చింది. సినిమా కోసం నేనూ వెయిటింగ్. పక్కనోడి సినిమాలు ప్లాప్ అయితే మనకి మంచిదని అనుకునే రకం కాదు నేను.
నాగార్జునగారితో చేస్తున్న సినిమా ఎంతవరకూ వచ్చింది?
షూటింగ్ జరుగుతోంది. వారం క్రితం నాగార్జునగారు షూటింగులో జాయిన్ అయ్యారు. ఆల్రెడీ మా మీద సాంగ్ షూట్ చేశారు. ఆయనతో వర్క్ చేస్తుంటే నా ఏజ్ కుర్రాడితో షూటింగ్ చేస్తున్నట్లుంది.
ఆ సినిమా తరవాత ఎవరి డైరెక్షన్లో చేస్తున్నారు?
ఏదీ ఫైనలైజ్ కాలేదు. ఐదారు కథలపై వర్క్ జరుగుతోంది. ముందుగా ఏది సెట్స్ మీదకు వెళ్తుందో చెప్పలేను.
ఐదారు కథల్లో కొరటాల శివగారి కథ కూడా వుందా?
లేదండీ. ఆయన డైరెక్షన్లో నేను చేస్తున్నానని వచ్చిన వార్తల్ని చదివా. అందులో నిజం లేదు.