తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5
హోటల్ లో ఎన్ని రకాలు తిన్నా, చివర్న వచ్చేస్తూ గుప్పెడు స్వీట్ సోంప్ నోటిలో వేసుకురాకుండా వుండలేరు జనాలు. ఆ ఫినిషింగ్ టచ్ అలాంటిది. ఇప్పుడు సినిమాల వ్యవహారం కూడా అలాగే వుంది. సినిమా అంతా ఎలా వున్నా, చివర పావుగంటా జనాలకు నచ్చేలా వుంటే మార్కులు పడిపోతున్నాయి. అలా కాకుండా దానికి రివర్స్ లో వెళితే..అంటే సినిమా ఆరంభం బాగుండి, చివరకు వచ్చేసరికి ఎందుకు వచ్చిన సినిమారా బాబూ అనిపిస్తే…ఇకపై అలాంటి సినిమాలను ఎంసిఎ అని పిలుస్తారేమో? అంటే ఫర్ ఎగ్జాంఫుల్..అదా..ఆ సినిమానా..అది ఎంసిఎ రా బాబూ అనే టైపులో అన్నమాట.
వరుస హిట్ లతో జోష్ మీద వున్న నిర్మాత. యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ వున్న హీరో. అబ్బాయిలే కాదు, అమ్మాయిల్ని కూడా ఫిదా చేసిన హీరోయిన్. ఇంతకన్నా ఏం కావాలి, సినిమాలు మార్నింగ్ షో ముందే థియేటర్ల దగ్గర బారులు తీరడానికి. వీళ్లను వాడేసుకుంటే చాలు, కథ పెద్దగా అక్కరలేదు అనుకున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఆయన సరే కథ అక్కర్లేదు హీరో హీరోయిన్ల క్రేజ్ వుంటే చాలు అనుకున్నాడు. కానీ కథను నమ్మికానీ సినిమాలు తీయని దిల్ రాజుకు ఏమయింది? ఇంత థిన్ లైన్ కథను పట్టుకుని సినిమా చుట్టేసారు?
ఇంట్లోవాళ్లకు ప్రమాదం వస్తే హీరో అండగా నిలబడడం. ఫ్యామిలీలో ఒకడు కావచ్చు, లేదా ఫ్యామిలీకి ఏదో విధంగా దగ్గర అయిన వాడు కావచ్చు. ఎన్ని కథలు అల్లుతారు. ఎన్ని సినిమాలు తీస్తారు ఇదే పాయింట్ తో? అని అనుకుని వుండడు దర్శకుడు వేణు శ్రీరామ్. అలా అనుకుని వుంటే ఎంసిఎ సినిమా తీయడు. తీసేసాడు కాబట్టి ఎలా వుందో చూసేయడమే. కానీ జనాలు మాత్రం ఎలా వున్నా చూసేయడమే అని అనుకోరు కదా. అది వేరే సంగతి. ఎందుకంటే ఇప్పటికే ఇలాంటి లైన్ లో రేసుగుర్రం, జవాను, హైపర్ ఇలా చాలా చూసి వుంటారు కదా?
కథ:
వదిన (భూమిక)కు సాయంగా వరంగల్ వెళ్తాడు నాని (నాని). అక్కడ పల్లవి (సాయిపల్లవి) తో ప్రేమ ప్రారంభమవుతుంది. ఇదిలా వుంటే అక్కడ శివ (విజయ్) అనే రౌడీ కమ్ గుండా కమ్ ట్రాన్స్ పోర్టు ఓనర్ తో నాని వదినకు వివాదం తలెత్తుతుంది. దీంట్లో నాని ఎంటర్ అవుతాడు. శివ బారి నుంచి వదినను నాని ఎలా కాపాడుకున్నాడు అన్నది మిగిలిన సినిమా.
విశ్లేషణ:
సరైన స్టార్ కాస్ట్ వుండి, ఇటు యూత్, అటు ఫ్యామిలీ లకు నచ్చే అంశాలు సరిగ్గా పడేస్తే, సినిమాకు కలెక్షన్లు కుమ్మేస్తాయని నిర్మాత దిల్ రాజుకు ఓ నమ్మకం వచ్చేసింది. కానీ యువ హీరోల సక్సెస్ లు అన్నీ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లే కానీ, మాస్ ఎంటర్ టైనర్లు కాదని దిల్ రాజు ఎందుకు నమ్మడం లేదో? నాని పరాజయాలన్నీ మాస్ ఎంటర్ టైనర్లే కావడం ఆయన గమనించినట్లు లేదు. గమనించి వుంటే సినిమా సెకండాఫ్ ఇలా వుండదు.
సినిమాలో వదినా మరిది అనుబంధాలు, మధ్యతరగతి ట్రేడ్ మార్క్ ఐడెంటిటీలు, అమ్మాయి అబ్బాయిల సరదా సరసాలు వుంటే సినిమా బాగుంటుంది అనుకోవడం వరకు ఓకె. కానీ వాటిని పక్కాగా మిక్స్ చేసే గట్టి కథను మాత్రం దర్శకుడు వేణు శ్రీరామ్ తయారు చేసుకోలేకపోయాడు. అయితే సన్నటి ఆ థ్రెడ్ కే , ఫ్యామిలీలకు పట్టేసే వదిన-మరిది అనుబంధాన్ని ముడేసాడు.
సినిమా తొలిసగం ప్రామిసింగ్ నోట్ తోనే ప్రారంభమవుతుంది. సీన్లు కూడా నాని మార్కు ఫన్ తోనే అల్లుకున్నాడు దర్శకుడు. సాయి పల్లవిని జనం ఏవిధంగా చూస్తే ఫిదా అవుతారో దృష్టి లో వుంచుకునే అలాగే రాసుకున్నాడు లవ్ సీన్లనీ. ఈ రెండింటికీ కాస్త వదిన సెంటిమెంట్ అద్దాడు. దీంతో తొలిసగం ఏ మాత్రం ప్రయాస లేకుండా పాస్ అయిపోతుంది. తొలిసగం ముగిసే సమయానికి అసలు కథ ఇదీ అని జస్ట్ చెప్పి, విశ్రాంతి ఇచ్చేసాడు.
కానీ వన్స్ మళ్లీ లోపలికి వచ్చిన వాళ్లకు తొలిసగం మ్యాజిక్ ను మరోసారి చూపించలేకపోయాడు దర్శకుడు. అనుబంధాల సీన్లు కాస్త కృతకంగా అనిపిస్తాయి. ఫ్రెండ్స్ మధ్య సీన్లు అంతగా పండినట్లు అనిపించదు. ఇక ప్రధానమైన విలన్ ట్రాక్ పూర్తిగా గాడితప్పింది. సినిమాకు మైనస్ పాయింట్లలో ముందుగా నిలిచేది విలన్, విలన్ ట్రాక్ నే. ద్వితీయార్థం అంతా నాని స్టయిల్ లో సాగదు సరి కదా, కథ సరిగ్గాలేకపోవడం, రొటీన్ గా వుండడంతో, ఇదోసీన్, అదోసీన్, అంటూ రకరకాలు కొంచెం కొంచెం ముడిపెట్టే ప్రయత్నం చేసాడు. ఆ అతుకులు సరిగ్గా పడలేదు. ఇదిగో వెన్నెల కిషోర్, అదిగో సాయిపల్లవి, అల్లదిగో విలన్ అంటూ ఇదో సీన్, అదో సీన్ అతుకేసుకుంటూ క్లయిమాక్స్ కు తీసుకుపోయాడు.
సినిమా ఆరంభం నుంచీ హీరోకి ఫొటోగ్రాఫిక్ మెమరీ వుందని చెబుతూ వచ్చాడు. అప్పటి నుంచే ప్రేక్షకుడికి అర్థం అవుతూ వస్తుంటుంది. దీన్ని దేనికో వాడతాడు అని. క్లయిమాక్స్ దాంతోనే ముడేసాడు. వంద బస్ ల వ్యాపారం వున్నవాడు, ఎవడ్ని బడితే వాడిని టపాల్న కాల్చి పడేస వాడు, వాడిని వాడు కాల్చుకోవడం ఏమిటో? హీరో మనుషులకు మాత్రం మినహాయింపు ఏమిటో? మా వాడు మినీ బస్ లోనే తిరుగుతాడు అంటుంది విలన్ తల్లి, కానీ ద్వితీయార్థం అంతా నియమం తీసి గట్టున పెట్టి కార్లో తిరుగడం ఏమిటో? ఇక చాల్లెండి చెప్పుకుంటే ఇలాంటివి చాలా వుంటాయి.
మొత్తం మీద ఒకటే మాట. పాత థిన్ లైన్ తో కొత్త క్రేజ్ ను తెచ్చుకున హీరో హీరోయిన్లతో తీసిన సినిమా. అంతే.
నటీనటులు:
హీరోనాని నటన రొటీన్ అవుతోంది. అది అతగాడు గమనించుకోవాలి. ఎంత అభిమానులైనా, ఇది నాని స్టయిల్ అని చెప్పుకోవడానికి బాగానే వుంటుంది కానీ, రాను రాను, అవే ఎక్స్ ప్రెషన్లు చూడడానికి బోర్ కొడుతుంది. అందువల్ల నాని బాగా చేసాడు అని చెప్పడానికి లేదు. అతని స్టయిల్ లో అతను చేసాడంతే. సాయిపల్లవి చేయడానికి పెద్దగా ఏమీ లేదు. అవకాశం వున్న సీన్లలో తన మార్కు పడేయగలిగింది. చానాళ్ల తరువాత కనిపించిన భూమిక, సీరియస్ నెస్ తప్ప మరో ఎక్స్ ప్రెషన్ పెద్దగా చూపించలేదు. విలన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.
సాంకేతికత:
దేవీశ్రీప్రసాద్ దగ్గర వుండిపోయిన ట్యూన్లు, లేదా హర్రీ హర్రీగా చేసిన ట్యూన్ లు ఇచ్చినట్లున్నాయి. రొటీన్ గా వున్నాయి తప్ప సూపర్ అన్నవి లేవు. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కూడా పెద్దగా మనసు పెట్టి చేసినట్లు లేదు. ఈ సీన్ కు ఇదే ఆర్ ఆర్ అని రెడీగా వున్న స్టాక్ లోంచి తీసి జోడించినట్లుంది. అసలు దేవీ చేసాడా ఈ ఆర్ ఆర్ అన్నది చిన్న అనుమానం. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఏమీ లేదు. లొకేషన్లు అన్నీ వరంగల్ చుట్టూనే తిరిగాయి. అందువల్ల పెద్దగా కొత్తగా కానీ, వింతగా కానీ ఏమీ లేవు. నాచురల్ లోకేషన్లు చూడడం మన జనాలకు అలవాటు తగ్గింది. ముఖ్యంగా చిన్న పట్టణాల విషయంలో. అందువల్ల సినిమాను చీప్ గా చుట్టేసిన లుక్ వచ్చింది.
ఫైనల్ టచ్: గూర్ఘా-వీధికొక్కడు
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5