నాని సినిమాలకున్న గొప్ప లక్షణం ఏమిటంటే.. తన మార్కెట్ పరిధిని దాటి ఎప్పుడూ ఖర్చు చేయనివ్వడు. అందుకు సినిమా కాస్త అటూ ఇటూ అయినా నిర్మాత టేబుల్ ప్రాఫిట్‌తో బయటపడిపోతాడు. బడ్జెట్ దాటుతోందంటే.. నానినే స్వయంగా కత్తిరింపులకు దిగుతాడు. అందుకే నానితో సినిమా తీసిన ఏ నిర్మాతా నష్టపోలేదు. అయితే తొలిసారి నాని సినిమా బడ్జెట్ పరిధి దాటుతోందని సమాచారం.
నాని కథానాయకుడిగా – రాహుల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్యామ్ సింఘరాయ్ సినిమా తెరకెక్కుతోంది. కొలకొత్తా నేపథ్యంలో సాగే కథ ఇది. సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడే తీయాలి. దానికి తోడు బడ్జెట్ పరిధి దాటుతోందని టాక్. ఈ సినిమాకి దాదాపుగా 40 కోట్లు కావాలట. ఎంత తగ్గించాలన్నా కుదరడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు బడ్జెట్‌ని తగ్గించడానికి కసరత్తులు జరుగుతున్నాయి. కొలకొత్తాలో షూటింగులకు పర్మిషన్ ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటన్న విషయాన్నీ సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. టక్ జగదీష్ తరవాత ఈ సినిమానే పట్టాలెక్కాలి. అయితే సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ నాని కోసం ఓ కథ రెడీ చేశాడు. పరిస్థితి చూస్తుంటే `శ్యామ్ సింఘరాయ్` కంటే శ్రీకాంత్ సినిమానే ముందుగా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సులు కనిపిస్తున్నాయి.