చిత్రసీమకు ‘శుక్రవారం’ అంటే యమా సెంటిమెంట్. దాదాపుగా కొత్త సినిమాలన్నీ శుక్రవారమే వస్తాయి. అయితే నాని మాత్రం ‘గురువారం’పై మనసు పడ్డాడు. తన సినిమాల్లో ఎక్కువ భాగం గురువారమే వచ్చాయి. ‘దసరా’, ‘హాయ్ నాన్న’… గురువారం విడుదలయ్యాయి. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల చేస్తున్నారు. అది కూడా గురువారమే. శుక్రవారం విడుదలైన సినిమాకు టాక్ బాగుంటే, శని-ఆదివారాలు హౌస్ఫుల్ అవుతాయి. వీకెండ్ ని బాగా క్యాష్ చేసుకోవొచ్చు. అదే.. గురువారం విడుదలైన సినిమాకు అంతే మంచి టాక్ వస్తే, వీకెండ్ 4 రోజులకు పొడిగించొచ్చు. దాంతో తొలివారాంతం మరిన్ని మంచి వసూళ్లు దక్కించుకోవొచ్చు.
నాని ప్లాన్ అదే. అందుకే గురువారం సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. తన సినిమాలు థియేటర్లో చూడ్డానికి ఫ్యామిలీ ఆడియన్స్ మక్కువ చూపిస్తుంటారు. అందుకే నాని.. గురువారం సెంటిమెంట్ ని కొనసాగిస్తున్నాడు. సినిమాలపై నమ్మకం ఉన్నవాళ్లు, మినిమం గ్యారెంటీ ఉంటుందని ఫీలైన వాళ్లూ.. గురువారం సెంటిమెంట్ ని ఫాలో అయితే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దసరా, హాయ్ నాన్న చిత్రాలే ఇందుకు ఉదాహరణ. సినిమాని శుక్రవారం విడుదల చేయడం ఓ సెంటిమెంట్ మాత్రమే. అదేమి నిబంధన కాదు. మెల్లమెల్లగా చిత్రసీమ కూడా గురువారం విడుదలమీద ఫోకస్ చేస్తే వీకెండ్ ని మరో రోజు పొడిగించుకోవొచ్చు. ఈ విషయంలో మిగిలిన హీరోలు, నిర్మాతలూ నానిని ఆదర్శంగా తీసుకొంటే మంచిదేమో..?