హీరోగా ఈ ఏడాదితో నాని పదేళ్ళు పూర్తి చేసుకోబోతున్నాడు. ఈ నేచురల్ స్టార్ హీరోగా పరిచయమైన ‘అష్టా చమ్మా’ విడుదలై సెప్టెంబర్ 5కి పదేళ్ళు. ఈ సందర్భంగా ఒక తెలుగు పత్రికతో నాని మాట్లాడారు. హీరోగా ఆయన విజయాలు, ప్రేక్షకుల అభిమానం గురించి బోల్డన్ని విషయాలు చెప్పారు. నాని మాటల్లో అందులోని ముఖ్యాంశాలు…
- – ఎక్కడో ప్రేక్షకులకు నాపై సాఫ్ట్ కార్నర్, ఇష్టం ఉన్నాయి. సినిమాల్లో నేను చేసిన చిన్న చిన్న తప్పులను క్షమించారు. మనం అంటే ఇష్టం లేదనుకోండి… ఎంత బాగా చేసినా క్షమించరు. నేనంటే ఎందుకంత ఇష్టం ఏర్పడిందని అడిగితే నేను చెప్పలేను. నేను ఊహించిన దానికంటే నా ప్రతి సినిమానూ పెద్ద హిట్ చేశారు.
- – నేనీ స్థాయికి వచ్చానంటే కారణం ప్రేక్షకులు. నాకు ఏ పేరూ లేనప్పుడు ప్రేక్షకులు సక్సెస్ ఇచ్చారు. అలాంటప్పుడు నేను పేర్ల వెనుక ఎందుకు పరిగెట్టాలి. ఎవరికి భయపడాలి? పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు మన కళ్ళ ముందు బోల్తా కొడుతుంటే… ఇంకా పేర్ల వెనుక పడడం ఎందుకు? నాకు కథ నచ్చితేనే ఎవరి సినిమా అయినా చేస్తా. కథ వినేటప్పుడు చిన్నపిల్లాడిలా, ప్రేక్షకుడిగా వింటా. ప్రేక్షకులంటే ఎవరో బయట నుంచి వచ్చినోళ్ళు కాదు. వాళ్ళది వేరే ప్రపంచమూ కాదు. నాతో సహా అందరూ ప్రేక్షకులే. అలా కాకుండా నేను హీరోననే దృష్టితో కథ వింటే కొత్త సమస్యలు వస్తాయి. హిట్స్ రావు.
- – ఇప్పటివరకూ కథ నచ్చకుండా నేను పేరున్న దర్శకుడు, మంచి కాంబినేషన్ అని ఒక్క సినిమా కూడా చేయలేదు. భవిష్యత్తులోనూ అలా చేయను. పెద్ద దర్శకులు కథ చెప్పినా.. చేయనని సున్నితంగా తిరస్కరించిన సందర్భాలున్నాయి. కథలో నన్ను నేను చూసుకోలేనప్పుడు సినిమా చేయను. కథకు క్యాస్టింగ్ వెరీ ఇంపార్టెంట్.
- – ఇంత చెప్పే నేనూ చాలా తప్పులు చేశా. తప్పులు చేసినప్పుడే ఏది రైటో నేర్చుకుంటాం. ఇప్పుడంతా వరుస విజయాలు అంటుంటే.. మనసులో రేపో ఎల్లుండో బ్రేక్ పడుతుంది కదా! అప్పుడు చూడాలి… వీళ్ళంతా ఏమనుకుంటారో! నా ప్రతి సినిమా చూశాక ‘ఓహ్! ఇదీ ఆడేస్తుందా? నెక్ట్స్ సినిమా ప్లాప్ అవుతుందేమో’ అని ప్రిపేర్డ్గా ఉన్నా.
- – కాలేజ్ రోజుల్లో యాక్టర్ కావాలనుకున్నా. అయితే.. అప్పుడు హీరో కావడానికి కావలసిన అర్హతల్లో నాలో ఒక్కటి కూడా లేదు. హైట్ లేదు, రంగు లేదు, హ్యాండ్సమ్ కాదు, సినిమా నేపథ్యం లేదు. నన్ను హీరోగా పెట్టి సినిమా తీసే నిర్మాతలు, ఫ్యామిలీ మెంబర్స్ లేరు. ఎలా హీరో అవుతావ్? అని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నా. అప్పుడు యాక్టింగ్ పక్కన పెట్టి డైరెక్షన్లోకి దిగా. డెస్టినీ చివరకు నన్ను నటుణ్ణి చేసింది.
- – నిర్మాతగా బ్యానర్ స్టార్ట్ చేసింది నాకోసం కాదు. కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి. నాకు డబ్బులు ముఖ్యం కాదు. నష్టాలు రాకుండా బయటపడగలను అనే నమ్మకం వుంది. ఎవరో నాని అనే కొత్తవాణ్ణి ఎంకరేజ్ చేస్తే ఈస్థాయికి వచ్చాడు. అలా నేను కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నా.
- – ఇటీవల గాసిప్స్ రాయడంలో చాలామంది దిగజారుతున్నారు. నేను రెమ్యునరేషన్ పెంచాననో… నాకు తలపొగరనో… ఏం రాసినా ఫర్లేదు. కానీ, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి చెత్త వార్తలు రాయకండి. ఎదుటి వ్యక్తి ఒక మనిషి అని గుర్తుపెట్టుకోండి. నాతో ఎప్పుడో వర్క్ చేసిన హీరోయిన్ గురించి అత్యంత నీచమైన ఆర్టికల్ ఒకటి చదివా. అది చూస్తే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందోనని ఫీలయ్యా. అలా రాయడం తప్పు.