ఏవరేజ్ సినిమాను హిట్ అని… హిట్ సినిమాను సూపర్‌హిట్ అని… ఊరూవాడా ప్రచారం చేసుకొనే హీరోలు, దర్శకులు, నిర్మాతలు మనకు కనిపిస్తారు. కొంతమంది తమకు ఇష్టం లేకపోయినా… చిత్రబృందంలో ఎవరో ఒకరి మొహమాటం కోసం మీడియా ముందు ప్లాప్ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తుంటారు. వసూళ్ల రికార్డులు సృష్టించిందని చెప్పుకుంటారు. అటువంటి ఫేక్ పబ్లిసిటీని నేచురల్ స్టార్ నాని అసలు ఎంకరేజ్ చేయడం లేదు. తన సినిమా సూపర్‌హిట్ కాలేదంటూ తనే స్వయంగా ట్వీట్ చేశాడు. అసలు వివరాల్లోకి వెళితే… నాని ద్విపాత్రాభినయం చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’ ఆశించిన విజయం సాధించలేదు. ఏప్రిల్ 12న విడుదలైన ఈ సినిమా ఈ రోజు (శుక్రవారం) డిజిటల్ ఫ్లాట్ఫార్మ్స్ అయిన అమెజాన్ ప్రైమ్, యుప్ టీవీలలోకి వచ్చింది. “నాని లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ని యుప్ టీవీ మినీ థియేటర్లో చూడండి” అంటూ యుప్ టీవీట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్ చేశారు. అందుకు బదులుగా “సూపర్ హిట్ అంట… అవ్వలేదు బాబాయ్. ఆడలేదు కూడా. అయినా మనసు పెట్టి చేశాం. చూసేయండి” అని రిప్లై ఇచ్చారు నాని. ఆయన నిజాయితీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అదండీ సంగతి!!