యంగ్ హీరోల్లో స్టార్ డమ్ అనుభవిస్తున్నవాళ్లలో నాని ఒకడు. తను నేచురల్ స్టార్. యూత్ లో కంటే కుటుంబ ప్రేక్షకుల్లోనే తన ఫ్యాన్స్ ఎక్కువ. అదే తన బలం కూడా. ఇండ్రస్ట్రీలో కూడా నానికి చాలామంది అభిమానులు ఉన్నారు. తనపై నమ్మకాన్ని నాని ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. నాని సినిమాలు ఫెయిల్ అవ్వొచ్చు కానీ, తన కథల ఎంపిక మాత్రం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కొన్నిసార్లు మంచి కథలు సైతం.. తగిన ప్రతిఫలాన్ని ఇవ్వలేవు. ఓసినిమా హిట్టవ్వడానికి, ఫ్లాపవ్వడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కానీ హీరోల జడ్జిమెంట్ అనేది చాలా కీలకమైన, ముఖ్యమైన విషయం. ఎప్పుడు ఎలాంటి కథ చేయాలి? ఏ దర్శకుడితో ట్రావెల్ అవ్వాలి? అనే విషయంలో హీరోలకు స్పష్టత ఉండాలి. కొన్నాళ్లుగా నానికి ఈ స్పష్టత లోపించిందేమో అనిపిస్తోంది.
ఈమధ్యకాలంలో నానికి వరుసగా 5 ఫ్లాపులొచ్చాయి. శ్రీకృష్ణార్జున యుద్ధం, దేవదాస్, గ్యాంగ్ లీడర్, వి… ఇప్పుడు టక్ జగదీష్… ఇవన్నీ ఫ్లాపులే. ఓరకంగా నాని తన కెరీర్లోనే అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న సీజన్ ఇదే కావొచ్చు. ఈ 5 సినిమాల్లో కథల విషయంలో నాని జడ్జిమెంట్ ఘోరంగా ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. ముఖ్యంగా కృష్ణార్జున యుద్ధం. ఇందులో నాని డ్యూయల్ రోల్ చేశాడు. కథలో ఎలాంటి వైవిధ్యం లేకపోవడం ప్రధాన బలహీనతగా మారింది. దేవదాస్ మల్టీస్టారర్ అయిపోయింది. ఇందులో నాని పాత్రకే ప్రాధాన్యం లేకుండా పోయింది. `వి` నాని టైపు సినిమా కాదు. ఇదో థ్రిల్లర్. నాని ప్రతినాయక ఛాయలున్న పాత్రని అద్భుతంగా పోషించినా, ఆ తరహా పాత్రల్లో నానిని చూడలేకపోయారు జనాలు. ఇక టక్ జగదీష్ లో చాలా బరువైన పాత్ర ఎంచుకున్నాడు. కథేమో కలగూరగంప. దానికి తోడు… తన నాచురాలిటీకి దూరంగా నాని నటన సాగే సరికి.. ప్రేక్షకులకు రుచించలేదు. వి, టక్ జగదీష్ సినిమాలు ఓటీటీకి వెళ్లినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలొచ్చినా – వాటి ఫలితాలు చూసి.. `బతికాం రా దేవుడా` అనుకుంటున్నారు బయ్యర్లు. ఓ రకంగా.. నాని కెరీర్లోనే ఇవి రెండూ పెద్ద డిజాస్టర్లు.
కథల ఎంపిక విషయంలో నాని ఒక్కసారి పునరాలోచించుకోవాలి. నాని బలం.. వినోదం. ప్రేమకథలు తనకి బాగా నప్పుతాయి. అందులో ఎమోషన్ ఉండేలా చూసుకుంటే.. నానికి తిరుగుండదు. పైగా అత్యంత సహజమైన తన నటనని ప్రదర్శించే వీలు దక్కుతుంది. అది కాదని, తనకు నప్పని జోనర్లు ఎంచుకుంటే ఇలాంటి ఫలితాలే చూడాల్సివస్తుంది. జాగ్రత్త నానీ.!