హీరో కుటుంబం నుంచే హీరో వస్తాడు.
స్టార్ ఇంట్లోనే స్టార్ పుడతాడు..
ఇంకెవ్వరికీ ఇక్కడ ఛాన్సుల్లేవు. ఎవరొచ్చినా సరే తొక్కేస్తారు. ఎవ్వరినీ ఎదగనివ్వరు..
– చిత్రసీమలో ఇలాంటి మాటలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. టాలీవుడ్లో గుత్తాధిపత్యం ఉందని, బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎవ్వరూ ఎదగలేరని బల్లగుద్ది మరీ చెబుతుంటారు. కానీ… అలాంటి మాటలన్నీ `నాని` లాంటివాళ్లు ఎదురైనప్పుడు చల్లాచెదురు అయిపోవాల్సిందే.
నాని వెనుక ఎవరున్నారు?
నాని ఏ హీరో కుటుంబం నుంచి వచ్చాడు?
నాని ఏ స్టార్ ఇంట్లో పుట్టాడు?
– ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే… టాలెంట్ ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుందన్న సమాధానం ఈజీగా దొరికేస్తుంది. నాని ఎదుగుదల చాలామందికి భరోసా ఇచ్చింది. చిత్రసీమలో ప్రతిభకు, స్వయంకృషికి ఇంకా చోటుందన్న నమ్మకాన్ని కలిగించింది.
నాని – నుంచి – నేచురల్ స్టార్‌గా ఎదిగిన ఓ ప్రయాణాన్ని చూస్తే ముచ్చటగా ఉంటుంది. ఆర్జేగా పనిచేసిన నానినీ ఇప్పుడు కోట్లకు కోట్లు పారితోషికం అందుకుంటున్న నానినీ చూస్తే స్వయం కృషి అంటే అర్థం తెలుస్తుంది. అష్టాచమ్మాకు ముందున్న నానినీ, ఇప్పటి నానినీ బేరీజు వేసుకుంటే – ప్రతిభకు పట్టం కట్టడం అంటే ఏమిటో తెలుస్తుంది. సినిమా సినిమాకీ ఎదుగుతూ, టాలీవుడ్ లో ఇప్పుడు మినిమం గ్యారెంటీ స్టార్‌గా ఎదిగాడు నాని. ఆ ప్రయాణం ఎవరికైనా ఓ పాఠం.
నాని సినిమాలు హిట్లయ్యాయి. ఫ్లాపులయ్యాయి. కానీ… హీరోగా, నటుడిగా నాని ఎప్పుడూ ఓడిపోలేదు. సహజమైన నటనకు తను కేరాఫ్. అందుకే నేచురల్ స్టార్ అయ్యాడు. కామెడీ టైమింగ్ విషయంలో నానిని ఢీ కొట్టే యువ హీరో ఎవ్వరూ లేరు. ఇది పరిశ్రమ మొత్తం నమ్ముతుంది. సన్నివేశంలో అరకొర దమ్మున్నా తనదైన నటనతో.. అలరించడం నానికి అలవాటైపోయింది. నాని సినిమా అంటే వినోదానికి ఢోకా లేదన్న గ్యారెంటీ వచ్చేసింది. ఓవర్సీస్లో నాని సినిమాకి పిచ్చ క్రేజ్. ఇదంతా నాని సంపాదించుకున్న ఆస్తి పాస్తులే.
తానొక్కడే ఎదిగడం వేరు. తనతో పాటు మిగిలినవాళ్లకూ ఎదగడానికి సాయం చేసేయం వేరు. విజేత అసలైన లక్షణం అదే. ఇప్పుడు నాని అదే చేస్తున్నాడు. నిర్మాతగా మారి, సినిమాలు తీస్తున్నాడు. తన సినిమాలో తాను హీరోగా చేయకుండా, మిగిలినవాళ్లకు ఛాన్సిచ్చి – కొత్తతరాన్ని ప్రోత్సహిస్తున్నాడు. అందుకే… నాని ఓ రియల్ స్టార్!