నాని రేంజు అంతకంతకూ పెరుగుతోందన్నది వాస్తవం. `జెర్సీ`కి ప్రీ రిలీజ్ బిజినెస్సే రూ.35 కోట్ల వరకూ జరిగింది. విడుదలకు ముందే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టడం నాని సినిమాలకు ఆనవాయితీగా మారింది. అయితే… ఎంత బిజినెస్సు బాగున్నా, నిర్మాతలకు లాభాలు వస్తున్నా – తన మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకోవడం తప్పనిసరి. ఈ విషయంలో నాని నిర్మాతలు మరీ ఓవర్ కాన్ఫిడెన్స్‌కి పోతున్నారేమో అనిపిస్తోంది. నాని – విక్రమ్ కెకుమార్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ అక్షరాలా రూ.50 కోట్లని సమాచారం. `జెర్సీ`కి రూ.35 కోట్ల బిజినెస్ జరిగింది. ఏ నిర్మాత అయినా.. తన హీరో గత చిత్రం చేసిని బిజినెస్ ని దృష్టిలో ఉంచుకునే బడ్జెట్ కేటాయించుకుంటాడు. కానీ మైత్రీ మూవీస్ మాత్రం రూ.15 కోట్లు అదనంగా పెట్టేసింది. విక్రమ్ కె.కుమార్ గురించి తెలియందేమీ లేదు. తన సినిమాలు కొత్త పంథాలో ఉంటాయి. సినిమా బాగుంది, అనే టాక్ వచ్చినా, కమర్షియల్‌గా ఆడని సందర్భాలు చాలా ఉన్నాయి. తాజా చిత్రం `హలో` నిర్మాతలకు నష్టాలనే మిగిల్చింది. ఈనేపథ్యంలో నాని సినిమాని మైత్రీ మూవీస్ 50 కోట్లు బడ్జెట్ కేటాయించడం సాహసోపేతమైన నిర్ణయమే అని చెప్పాలి. `జెర్సీ` విడుదలై భారీ లాభాలు తెచ్చిపెట్టి, `నాని సినిమాని కొని తీరాల్సిందే` అని బయ్యర్లు అనుకుంటే తప్ప… విడుదలకు ముందే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ దక్కించుకోవడం కష్టం. ఇది మైత్రీ మూవీస్‌కి కూడా తెలియని పాయింటేం కాదు. అయినా సరే రిస్కు చేస్తున్నారంటే… బలమైన కారణమేదో ఉండే ఉంటుంది.