నాని అంటే ఎంటర్టైన్మెంట్ కథలే గుర్తొస్తాయి. అయితే కొంతకాలంగా నాని యాక్షన్ కథా చిత్రాలవైపు మొగ్గు చూపిస్తున్నాడు. ఇప్పుడు వివేక్ ఆత్రేయతో చేస్తున్న ‘సరిపోదా శనివారం’ ఓ యాక్షన్ డ్రామానే. అంతకు ముందు వచ్చిన ‘దసరా’ పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం. ఇప్పుడు 32వ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈరోజు నాని పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ కొత్త చిత్రానికి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేశారు. గ్లింప్స్ చూస్తే.. ఇదో సరికొత్త యాక్షన్ డ్రామా అనిపిస్తోంది. యానిమేషన్‌తో చేసిన విజువల్స్ తో.. కథని చూచాయిగా చెప్పే ప్రయత్నం చేశాడు సుజిత్. ‘సాహో’ సినిమాతో తనలోని యాక్షన్ ఇంటెన్స్ని చూపించాడు సుజిత్. ఇప్పుడు పవన్‌తో చేస్తున్న ‘ఓజీ’ కూడా అలాంటి యాక్షన్ డ్రామానే. నాని కోసం కూడా ఓ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ కథ రాసుకొన్నాడు. ‘ఓజీ’ పూర్తయిన వెంటనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. 2025లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.