హీరోగానే కాదు, నిర్మాతగానూ నాని తన అభిరుచి చూపించుకొంటున్నాడు. తన నిర్మాణంలో ఓ సినిమా వస్తోందంటే.. కచ్చితంగా ఓ ఆసక్తి ఏర్పడుతోంది. బాక్సాఫీసు దగ్గర విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకొంటున్నాడు. తన నిర్మాణంలో ‘కోర్ట్’ అనే ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ప్రియదర్శి హీరో. పేరుకు తగ్గట్టుగా ఇదో కోర్ట్ రూమ్ డ్రామా. షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. మార్చిలో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఓటీటీ డీల్ కూడా పూర్తయ్యిందని సమాచారం.
ఈ సినిమా రూ.9 కోట్లకు అమ్ముడుపోయిందని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ దక్కించుకొందట. రూ.9 కోట్లంటే మంచి రేటే. పైగా ఈ సినిమా కూడా రూ.9 కోట్ల లోపే పూర్తి చేశారని తెలుస్తోంది. అంటే.. కేవలం ఓటీటీ హక్కుల రూపంలోనే పెట్టుబడి దక్కించుకొన్నారన్నమాట. ఇక మిగిలిందంతా లాభమే.
ఇటీవల ఫోక్సో చట్టం గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. జానీ మాస్టర్ కూడా ఇదే కేసుపై అరెస్టయ్యారు. ఇప్పుడాయన బెయిల్ పై ఉన్నారు. ఈ సినిమా కథ కూడా ఫోక్సో చట్టం చుట్టూనే తిరుగుతందట. కరెంట్ పాయింట్ నే పట్టుకొన్నాడు దర్శకుడు. బాక్సాఫీసు దగ్గర కూడా ఈ సినిమా ప్రభావం చూపించే అవకాశం ఉంది.