టాలీవుడ్ లో నిజంగానే దర్శకుల కొరత ఉంది. కాస్త ప్రతిభ ఉంది.. అనుకొంటే చాలు.. నిర్మాతలు, హీరోలు కర్చీఫ్‌లు సిద్ధం చేసేస్తున్నారు. దసరా టీజర్ వచ్చాక.. దర్శకుడు శ్రీకాంత్ పరిస్థితి ఇదే! నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమాలో నాని లుక్ చూసి అంతా షాక్‌తిన్నారు. టీజర్ వచ్చాక… ఆ షాకులు మరిన్ని ఎక్కువయ్యాయి. రా అండ్ రస్టిక్ సినిమాకి కేరాఫ్‌గా నిలుస్తోంది `దసరా`. ఈ సినిమా మొదలైన తొలి షెడ్యూల్ కే… `కొత్త కుర్రాడెవరో బాగా తీస్తున్నాడు` అనే టాక్ బయటకు వచ్చింది. టీజర్ వచ్చాక… అంతా ఫిక్సయిపోయారు. దాంతో… శ్రీకాంత్ ఓదెల కోసం కర్చీఫులు రెడీ చేసుకొంటున్నారు టాలీవుడ్ హీరోలు. ఇప్పటికే ఇద్దరు యంగ్ హీరోలు శ్రీకాంత్ ఓదెల టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఓ పెద్ద బ్యానర్… అడ్వాన్సు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యింది. `దసరా` ఫలితంతో సంబంధం లేకుండా సినిమా తీస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నార్ట. టీజర్ అంత ఇంపాక్ట్ కలిగించింది. నాని కూడా శ్రీకాంత్ గురించి మిగిలిన హీరోల దగ్గర మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నాడట. తను స్టార్ డైరెక్టర్ అవుతాడంటూ.. మెచ్చుకొంటున్నాడట. దాంతో… మిగిలిన హీరోలు ఇప్పుడే అప్రమత్తమైపోతున్నారు.