యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన జెంటిల్మెన్ సినిమా గుర్తింది కదా? రాబిన్ వుడ్ తరహాలో సాగే మంచి యాక్షన్ చిత్రమది. ఓ దొంగని పట్టుకోవడానికి పోలీస్ అధికారి చేసే ప్రయత్నాలే ఈ కథ. ఆ సినిమాకీ ఇప్పుడు నాని – సుధీర్‌బాబు కథానాయకులుగా నటించిన `వి`సినిమాకీ దగ్గర పోలికలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉగాదికి విడుదల అవుతోంది.
జెంటిల్మెన్లో అర్జున్ ఓ ఘరానా దొంగ. చెప్పి మరీ దొంగతనాలు చేస్తుంటాడు. చరణ్‌రాజ్ అర్జున్ ని పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్. వీరిద్దరి మధ్యా నడిచే దొంగ – పోలీస్ కథ బాగా రక్తి కట్టింది. `వి`లో కూడా అంతే. నాని ఓ హత్య చేస్తాడు. ఆ కేసుని సుధీర్ బాబు డీల్ చేస్తుంటాడు. నాని ఒక్క హత్యతో ఆగడు. హత్యల మీద హత్యలు చెప్పి మరీ చేస్తుంటాడు. దాంతో ఈ కేసు సుధీర్‌బాబు వ్యక్తిగతంగా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. జెంటిల్మెన్లో స్క్రీన్ ప్లే ట్రిక్కుని ఈ సినిమాలో ఇంద్రగంటి తెలివిగా వాడుకున్నాడన్నది ఇన్సైడ్ టాక్. ద్వితీయార్థంలో నాని ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్‌గా సాగుతుందని, అసలు నాని హంతకుడిగా ఎందుకు మారాడో.. సెకండాఫ్‌లో తెలుస్తుందని, ఈ ఎపిసోడ్ ఎంత బాగా క్లిక్ అయితే సినిమా అంత బాగా ఆడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సేమ్ టూ సేమ్ జెంటిల్మెన్ లోనూ అంతే. దొంగతనాలు చేసే హీరోకంటూ ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అదీ ఎమోషనల్‌గా సాగుతుంది. మొత్తానికి జెంటిల్మెన్ స్ఫూర్తితో ఇంద్రగంటి ఈ కథ రాసుకున్నాడనిపిస్తోంది. మరి ఆ ప్రభావం ఎంతో తెలియాలంటే ‘వి’ రావాల్సిందే.