నాన్నకు ప్రేమతో సినిమాకి హిట్ టాక్ రావడంతో.. అందరి కంటే ఎక్కువగా హ్యాపీగా ఫీలవుతోంది ఆ ముగ్గురే. ఒకరు జూనియర్ ఎన్టీఆర్. రెండు సుకుమార్. మూడు దేవిశ్రీప్రసాద్. ఈ ముగ్గురు ఈ సంక్రాంతికి తమ తండ్రులకు ఓ హిట్ సినిమాని బహుమతిగా ఇచ్చారు.
నాన్నకు ప్రేమతో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటనకి మంచి పేరొచ్చింది. తన స్టైల్ మాస్ క్యారెక్టర్లతో అభిమానులను అలరించే ఈ యంగ్ టైగర్… నాన్నకు ప్రేమతో సినిమాలో సూపర్ స్టైలిష్ గా కనిపించాడు. ఈ సినిమాకి మెయిన్ ఎసెట్ గా నిలిచాడు. పైగా సంక్రాంతి బరిలో బాబాయ్ తో బస్తీమే సవాల్ అంటూ.. పందెంకోడిలా బరిలో దిగాల్సివచ్చినప్పుడు.. నీకు నేనున్నాను నాన్నా అంటూ వెంట ఉండి ప్రోత్సహించిన నాన్న హరికృష్ణకి ఈ సినిమా హిట్ ను గిఫ్ట్ గా ఇచ్చినట్టే. తన కెరీర్ లో 25వ సినిమాని హిట్ గా మలుచుకుని… మా నాన్న మగాడ్రా బుజ్జి అని తన కొడుకు అభయ్ రామ్ భవిష్యత్ లోకాలర్ ఎగరేసుకునేలా చేశాడు. పైగా ఈ సినిమాలో తన కొడుకు పేరు అభయ్ రామ్ కు దగ్గరగా అభిరామ్ అనే పేరు పెట్టుకుని సంక్రాంతికి హిట్ కొట్టి పండగ చేసుకుంటున్నాడు.
మా నాన్న ఆఖరి ఘడియల్లోంచి పుట్టిందే ఈ సినిమా కథ అని సుకుమార్ ఎప్పుడో చెప్పాడు. తన పాత సినిమాల తరహాలో సైన్స్ టీచర్ , మ్యాథ్స్ టీచర్ లా ఈక్వేషన్స్ గురించి చెప్పకుండా ఈ కథని సింప్లీ సూపర్బ్ గా హ్యాండిల్ చేశాడని పేరు సంపాదించుకున్నాడు. పండుగకి హిట్ తో తన తండ్రి తిరుపతిరావు కి బహుమతిగా అందించాడు. అసలు ఈ సినిమాకి డబుల్ ఆనందం పొందుతోంది మాత్రం సుక్కునే. ఎందుకంటే.. జనవరి 11న తన బర్త్ డే, జనవరి 13న తన సినిమా హిట్ డేని డబుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు సుక్కు.
నాన్నకు ప్రేమతో సినిమాకి మూడో ప్లస్ పాయింట్ గా దేవి శ్రీ ప్రసాద్ పేరు బాగా వినిపిస్తోంది. రాక్ స్టార్ డీఎస్పీ బ్రాండ్ తో పాటలను ఉర్రూతలూగించిన దేవి.. సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మంచి మార్కులే పడుతున్నాయి. పైగా ఈ సినిమా కి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సమయంలోనే దేవి తండ్రి, ప్రముఖ కథ, మాటల రచయిత సత్యానంద్ కన్నుమూశారు. ఈ సినిమాకి మ్యూజికల్ హిట్ గా నిలిపి.. తన తండ్రికి డీఎస్పీ నివాళి అర్పించినట్టే.