మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి చేసిన ఓ ప్రకటన ఇప్పుడు సంచలనాన్ని సృష్టించడమే కాక.. ప్రకంపనలనూ రేకెత్తిస్తోంది. మహిళలు స్వీయ రక్షణ కోసం కత్తులు పుచ్చుకుని తిరగాలనేది ఆమె ప్రకటన సారాంశం. విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో సామూహిక అత్యాచారానికి గురైన ఇద్దరు గిరిజన యువతులను ఆమె విశాఖలో పరామర్శించారు. వారిని చూసి, కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం ఆమె ఈ ప్రకటన చేశారు. కత్తులు పెట్టుకుని తిరిగి మానవ మృగాలు ఎదురైతే వారి మర్మాంగాలను కోసేయాలని కూడా నన్నపనేని మహిళలకు పిలుపునిచ్చారు. అధికార పార్టీకి చెంది ఉండి.. మహిళా కమిషన్ ఛైర్మన్ హోదాలో ఆమె మాట్లాడాల్సిన మాటలు కావివి. తెలుగు దేశం హయాంలో ఆడవారిపై చోటుచేసుకున్న కేసులలో ఎన్నిటికి న్యాయం చేశారో ఆమె ఒకసారి బేరీజు వేసుకోవాలి. వెనక్కి తిరగ్గానే ఆమెకు నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి ఉదంతం కనిపిస్తుంది. ఇంకొంచెంద దృష్టి పెంచుకుంటే తహశీల్దారు వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన దౌర్జన్యమూ కళ్ళకు కడుతుంది. వనజాక్షిదే తప్పని సాక్షాత్తూ ముఖ్యమంత్రే తేల్చేసిన విషయం తెలుస్తుంది. కాల్ మనీ ఆధారంగా ఆడవారిపై జరిగిన అత్యాచారాలూ, సెక్స్ ర్యాకెట్లూ కనిపిస్తాయి. పెప్పర్ స్ప్రేనో, కారమో, మరేదైనా ఆయుధమో పట్టుకోమని చెప్పి ఆగుంటే బాగుండేది. ఏకంగా మర్మాంగాలే కోసేయమని పిలుపునివ్వడం మహిళలను రెచ్చగొట్టడమే కాగలదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఆవేశాలను పెంచే ప్రకటనలు చేయకుండా ఉంటే మంచిది.